Search
  • TPN Acharyulu

మీ కోసం - 1

మీ కోసం – 1


“ మీకోసం" అనే శీర్షిక లో అనేక విషయాలు తెలుసుకో వచ్చు. “కోసం" అనే పదం ఎక్కడిది. కొరకు,కై, అనే చతుర్థీ విభక్తి ప్రత్యయాలు కదా వాడాలి. కాని మనం తరచూ “ కోసం" అనే పదాన్నే వాడుతాం. ఎవరికోసం, ఇందుకోసం మనకోసం, మీకోసం వగైరా,; కోసం అనేది అచ్చ తెలుగుపదం. అలాగే సమయాన్ని సూచించే పదం తెలుగులో ఏముంది? “ కాలం" ఎంతకాలం, కొంతకాలం, కాని “ కాలం" సంస్కృత పదం కదా ! మరి తెలుగో కొంచం సేపు ఆలోచించండి. తెలిసిందికదా. అదేనండి కాలాన్ని సూచించే తెలుగు పదం “ సేపు" ఎంత సేపు, కొంత సేపు.ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసు కోవచ్చు.


మీ కోసం – 2


అభిమన్యుడి మరణ వార్త విని, అర్జునుడు, శ్రీకృష్ణుడు చాల బాధ పడుతూ ఉంటారు. బంధువులు,ఆప్తులు వచ్చి, అర్జునుణ్ణి ఓదారుస్తారు. అలాగే కృష్ణుడి వద్దకు వచ్చి “అర్జునుడు బాధపడుతున్నాడు సరే, అన్నీతెలిసిన స్వామీ! మీరెందుకు బాధపడుతున్నారు" అని అడుగు తారు. అపుడు శ్రీకృష్ణుడు “ యుద్ధానికి ముందే అర్జునుడికి భగవద్గీత బోధించేను అయినా అర్జునుడు బాధ పడుతున్నాడు. నా బోధన వ్యర్థం అయిందే అని నేను బాధపడుతున్నాను" అని సెలవిస్తాడు. కల్పితమైనా పై కథ బాగుంది కదా! గీత పారాయణ చేయడం కాదు. గీతలోని మొదటి శ్లోకంలో మొదటిపదం “ధర్మ క్షేత్రే “ అన్నదాన్ని చివరిశ్లోకం “యత్ర యోగీశ్వరః కృష్ణః" అన్నదానిలోని చివరి పాదం “మతిర్మమ" అన్నదానిని గ్రహించి “ ధర్మక్షేత్రే, మతిర్మమ" ధర్మమునందే నా బుద్ధిని నిలుపు. అన్నగీతాసారాన్ని గ్రహించి, ఆచరించాలి “ అని ఋషి వాక్కు. ప్రయత్నిద్దాం.


మీ కోసం - 3


ఈ నాడు హేతువాదులు. నాస్తికులు అనే ఓ వర్గం మీడియా వారు ఏర్పాటు చేసే కొన్ని చర్చా గోష్టులలో పాల్గొని తమ అభిప్రాయాలను గొప్పగా చేపుతూవుంటారు. అసలు నాస్తి అన్నపదం లోనే 'ఆస్తి' ( న +ఆస్తి ) అనేపదం ఉంది. అంటే ఎదో ఉంటేనే కదా అది లేదు అని చెప్పడానికి. కనుక నాస్తికులు అంటే ఉన్న భగవంతుణ్ణి లేడు అని చెప్పేవారు అనుకోవచ్చు. ఇట్టి నాస్తికులు పూర్వ కాలంలో కూడా వుండేవారు. వీరిని " చార్వాకులు " అని పిలిచేవారు. వీరిమతం " చార్వాకమతం" చార్వాకులు భౌతికవాదులు.వీరికి, ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం.( కనబడేది) పంచభూతాలలో భూమి,అగ్ని, జలం ,వాయువు మాత్రమే వీరికి ప్రమాణం.ఆకాశం కాదు. ఆత్మ,ఆత్మజ్ఞానం, పరమాత్మ అనేవి లేవు అనేది వీరివాదన.స్వర్గం అంటే ఆలింగనాదుల వల్ల కలిగే సుఖమనీ, నరకం అంటే ,కంటకాదుల (ముళ్లు ఆయుధాలు )వల్ల,ఘాతాల (దెబ్బల) వల్ల కలిగే బాధ.అని వీరి అభిప్రాయం. రాజే భగవంతుడు, దేహం త్యజించడమే మోక్షం.అన్నది వీరి భావన. ఇంకా " పశుశ్చేన్నిహత: స్వర్గం, స్వపితా కస్మాన్నహింసతే" అనగా యజ్ఞ యాగాదులలో పశువుని చంపితే దానికి మోక్షం వస్తుంది అని అనుకొంటే తన తండ్రినే యజ్ఞ పశువుగా బలి ఇవ్వవచ్చుకదా?! ఆయనకే మోక్షం వస్తుంది అన్నది వీరి వాదన. చచ్చిన వారికి ఇక్కడ పిండం పెడితే పైన ఉన్నవారికి తృప్తి కలిగినపుడు, దూరప్రయాణం లో ఉన్నవారికి ఇక్కడ ఇంట్లో ఆహారం పెడితే చాలుకదా?! " స్వర్గ స్దితా యధా తృప్తిం" ఇక్కడ భోజనం పెడితే పైన వున్నవారు తృప్తి చెందితే " ప్రాసాదస్యోపరి స్ధితానాం " మేడ మీద ఉన్నవారికి క్రింద భోజనం పెడితే చాలుకదా?! అన్నది వీరి వితండ వాదన. పైలోకాలు,పితృకార్యాలు ఇవన్ని స్వార్థం కోసం ఒక వర్గంవారు కల్పించేరు అని వీరిభావన.కనుక " యవజ్జీవేత్ సుఖం జీవేత్" బ్రతికి ఉన్నన్ని రోజులూ సుఖంగా జీవించు,అప్పు చేసైనా నేయ్యికొని తిను, భస్మమైన దేహం మరల తిరిగి రాదు, పైలోకం చేరడంలాంటివి లేవు. అనేది చార్వాకుల మతం. అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడు ఇలాంటి వారు ఉంటూనే ఉంటారు. వీరు ఉంటేనే భగవంతుని ఉనికికి మరింత బలం చేకూరుతుంది. అస్తు. పంచ భూతాలలో ఆకాశం తప్పక ఉంది. " శబ్దగుణకం ఆకాశం" శబ్దమే ఆకాశ లక్షణం అందుకే వేదాలు బ్రహ్మని శబ్ద స్వరూపునిగా " శబ్ద బ్రహ్మ" గా వర్ణిం చాయి. " ఇదమంధ తమకృత్స్నం జాయతే భువనత్రయం యది శబ్దాన్వయం జ్యోతి: ఆసంసారం నదీప్యాతే" శబ్దమనే జ్యోతి వేలగకపోతే,మూడు లోకాలు చీకటిలోనే ఉండేవి అని ఆర్యోక్తి. అది ఎలాగో మరల వివరిస్తాను.

మీ కోసం - 4


" మీకోసం " శీర్షికలో శబ్ద బ్రహ్మను గూర్చి వివరిస్తాను. క్షరము కానిది అక్షరం. అనగా నాశనములేనిది, ఆ అక్షర సమూహమే శబ్దం అది అనంతం,అభిన్నం,అఖండం. అదే చైతన్య స్వరూపమైన పర బ్రహ్మము. బ్రహ్మ సూత్రాలలో " అధాతో బ్రహ్మ జిజ్ఞాస" అని ప్రారంభించి, సుమారు 555.సూత్రాలు పర బ్రహ్మను గూర్చే వివరించబడింది. "జ్ఞాన, బల, ఐశ్వర్య ,వీర్య,శక్తి, తేజస్సు " లనే ఆరు గుణాలు కలవాడు ," అంతర్బహిశ్చ తస్సర్వం వ్యాప్య నారాయణ స్థిత:" అన్నట్లు అంతటా వ్యాపించినవాడు. ఐన భగవానుని శబ్ద రూపంలోనే మనం తెలుసు కొంటున్నాము. ఈ శబ్ద బ్రహ్మకి " పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి" అని నాలుగు ముఖాలు.అదే చైతన్య స్వరూపమైన " అకార,ఉకార,మకారాల కలయికతో ఏర్పడిన ఓం కారం"! ఈ శబ్ద బ్రహ్మని ఉపనిషత్తు ఇలా వివరిస్తుంది. " అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్త్వం యదక్షరం/ వివర్తతేర్థ భావేన ప్రక్రియా జగతో యత:!!" అని. నాభి, గొంతులో ఉండే స్వరపేటిక, నాలుక, దంతాలు ,పెదవులు, నాసిక , మూర్థన్యముల మీదుగా వచ్చే శబ్దమే ఈ సమస్త చైతన్యానికి మూలం. అదే "శబ్ద బ్రహ్మమని" దానిని తెలుసుకోనుటే " ఆత్మ జ్ఞానమని" ఋషులు మనకి వివరించేరు. ఈ ఆత్మ జ్ఞానం గురుముఖతః మాత్రమే మనకి లభిస్తుంది.దీనిని మనందరికీ తెలిసిన రెండు కథల ద్వారా వివరిస్తాను. మొదటి కథ. " పరమానందయ్య శిష్యుల కథ అందరికి తెలిసినదే కదా? శిష్యులు చేసే చేష్టలు తెలివి తక్కువగా పైకి కనిపించినా , వాటివెనక ఎదో ఒక అంతరార్థం ఉంటూనే ఉంటుంది. ఈ శిష్యులు ఒక రోజు నదీస్నానానికి వెళతారు.స్నానం చేసి ఒడ్డుకు వచ్చి అందరూ ఉన్నారో లేదో అని లెక్కించడం ప్రారంభిస్తారు.లెక్కించే ప్రతి వాడు తనని లెక్కపెట్టకుండా ఎదుటివారిని మాత్రం లెక్కించి ఒక్కడు తగ్గాడని, వాడు నదిలో కొట్టుకు పోయాడని, విలపిస్తూ ఉంటారు. అపుడు అటుగా పోతున్న బాట సారి వీరివద్దకి వచ్చి, " ఎందుకు బాధపడుతున్నారు" అని అడుగుతాడు. మేము పదిమందిమి, "నదిలో స్నానం చేసి ఒడ్డుకు చూస్తే "ఒకడు" లేడు, వాడునదిలో కొట్టుకు పోయాడు అందుకు ఏడుస్తున్నాము." అని చెపుతారు. బాటసారి వారి అజ్ఞానానికి నవ్వుకొని, వరుసగా వారిని నిలబెట్టి, తాను లెక్కించి, పదిమంది ఉన్నారు అని చెపుతాడు. అప్పుడు వారు బ్రహ్మానందభరితులై ఇంటికి వెళతారు" ఇది అందరికి తెలిసిన కథ. ఇది ఆత్మ జ్ఞానానికి చక్కని ఉదాహరణ. ఉపనిషద్భాషలో " పదిమందిలో ఒకడు లేకపోవడం, తనని తాను మరచిపోవడం "అజ్ఞానం" .ఉన్నవాడిని లేడు అనుకోవడం "ఆవరణ" నదిలో కొట్టుకు పోయాడు అనుకోవడం "మిధ్యా జ్ఞానం" వాడు చచ్చిపోయాడు అని బాధపడటం "విక్షేపం" వేరేవారు వచ్చి నీవేపదవవాడివి అని గురువులా చెప్పగా తనని తాను తెలుసుకొని ఆనందించడం " ఆత్మజ్ఞానం" పొందడం. హాస్య భరితమైన ఈ కథలో వేదాంతపరమైన ఇంత అర్థం ఇమిడి ఉంది. అజ్ఞానం,ఆవరణ,మిధ్యాజ్ఞానం, విక్షేపం అనే దశలు దాటితే "ఆత్మజ్ఞానం" లభిస్తుంది. ( ఇంకావుంది.) చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

మీ కోసం – 5

" మీకోసం" శీర్షికలో పరమానందయ్య శిష్యుల కథ ద్వారా ఆత్మజ్ఞానం గురుముఖతః ఎలాపొందవచ్చో తెలుసుకొన్నాం. ఇప్పుడు మనం ఎప్పటి నుండో అమ్మమ్మ/నాయనమ్మ ల ద్వార విన్న ఏడు చేపల కథ ఎంతో గొప్ప ఆధ్యాత్మికరహాస్యానికి ప్రతీకగా " సింబాలిజంగ" చెప్పబడిందో,తెలుసుకొందాం. మన పూర్వీకులు ఎప్పుడు పిల్లలు కథ చెప్పమన్నా " అనగనగా ఒకరాజు, ఆరాజుకి ఏడుగురుకోడుకులు. వేటకి వెళ్లి , ఏడు చేపలు తెచ్చి ఎండ బెట్టారు, అందులో ఒక చేప ఎండలేదు, చేప చేప ఎందుకు ఎండలేదు " అంటే వరుసగాకారణాలు చెప్పి కథ ముగిస్తారు. ఇందులో ఏడు చేపలు " ఏడు వ్యసనాలకి" ప్రతీక. అవి -- కామం (అంటే కోరిక, ) వేట, ( పూర్వం) జూదం, సురాపానం, వాక్ పారుష్యం, అకారణంగా ఇతరులను బాధించడం,ఆడంబరమైన ఖర్చు. ఇవి సప్త వ్యసనాలు.వీటిలో కామం ముఖ్యమైనది. కామానికి, " ప్రతీక" ఎండని చేప. కామంతోపాటు మనలో ఆరుగురు శత్రువులు ( అరిషడ్వర్గం, అరి=శత్రువు. షట్ =ఆరు. అవి కామ,క్రోధ,లోభ ,మోహ, మద ,మాత్సర్యాలు.) ఉంటారు. అవి మనల్ని వదలి పోవు. కనుకనే ఒక చేప ఎండ లేదు. " చేప చేప ఎందుకు ఎండ లేదు? గడ్డికుప్ప చాటువచ్చింది" ఈ గడ్డికుప్ప " మాయ,లేక అజ్ఞానానికి " ప్రతీక.(అది ఆవరించి ఉండగా మనకి జ్ఞానం కలుగదు.బ్రహ్మాన్ని తెలుసుకో లేము.) " గడ్డికుప్ప! ఎందుకు చాటు వచ్చావు" అంటే " ఆవు నన్ను మేయలేదు" ఇక్కడ ఆవు " ఆత్మ జ్ఞానానికి" ప్రతీక. ఆవు తినడం అంటే జ్ఞానం చేత,అజ్ఞానం తొలగి పోవాలి." ఆవు,ఆవు!ఎందుకు మేయలేదు?" గొల్లవాడు విప్పలేదు.! జ్ఞానాన్ని కలిగించేది గురువు, గొల్లవాడు " గురువుకు" ప్రతీక. ఆ గురువు.సాక్షాత్ కృష్ణుడే! " కృష్ణం వందే జగద్గురుం"కదా! "గొల్లవాడ! ఆవుని ఎందుకు విప్పలేదు" అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ! " సాక్షాత్ అమ్మవారికి" ప్రతీక. తొలి గురువు అమ్మేకదా! అమ్మ ఆజ్ఞ లేనిదే స్వామి కూడా ఏమి చేయడు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు ( ఆజ్ఞ ఇవ్వలేదు) "పిల్లవాడు ఎద్చేడు" " పిల్లవాడు జీవునికి " ప్రతీక. ఏడవడం " పాపానికి " ప్రతీక. పుట్టలో వేలు పెట్టడం అంటే నిరంతరం పాపాలుచేయడమే మానవ నైజం. చీమ కుట్టడం " పాపాలఫలితం " అనుభవించడం. కనుక "అమ్మవారి కటాక్షం పొంది, స్వామివారి ఉపదేశం తో ఆత్మ జ్ఞానాన్ని పొంది సన్మార్గంలో నడవాలి " అన్న సత్యాన్ని ఈ కథ ద్వారా తెలుప బడింది.

32 views0 comments
Join my mailing list

© 2020 by TPN Acharyulu

This site was designed with the
.com
website builder. Create your website today.
Start Now