top of page
Search
  • TPN Acharyulu

సంస్కృత న్యాయాలు-ఆధ్యాత్మిక విశేషాలు (4వ భాగం)


అంధ కరదీపికా న్యాయం


అనగా `'గుడ్డి వాని చేతిలో దివ్వె'' అని అర్ధం. చీకటిలో ఉన్నపుడు కళ్ళున్న వాడి చేతిలో జ్యోతి ఉంటే అంతా కనబడుతుంది గాని, గుడ్డివాని చేతిలో దివ్వె (కరదీపం) ఉంటే లాభం లేదు కదా. అని ఈ న్యాయం తెల్పుతుంది. దీనిని పోతనగారి భాగవతంలోని ప్రహ్లాద చరిత్రతో వివరిస్తాను. తండ్రి అయిన 'హిరణ్యకశిపుడ' ప్రహ్లాదునితో 'చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వి వేక చతురత కల్గున్.'(అన్న పద్యంలో) చదువు కొంటే, మంచి చెడులు తెలుస్తాయి చదువు లేకపోతే అజ్ఞానంతో ఏమి తెలియదు.' అని తెల్పి. గురువుల వద్దకి పంపు తాడు. కొంతకాలం తరువాత కొడుకుని పిలిపించు కొని 'ఎలా చదువు తున్నావు. గురువులు ఎటువంటి చదువు చెప్పార' అని అడుగుతాడు.(ఈకాలం ప్రోగ్రస్ రిపోర్టు వలే) అప్పుడు ప్రహ్లాదుడు చక్కని సమాధానం చెప్తాడు.

'చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు , చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ.'

అనేక శాస్త్ర విద్యలు చదివి, వాటిలోని మర్మం అంటే సారాంశం గ్రహించాను. అంటాడు. గుడ్డిగా ఏది పడితే అది చదవకుండా తనకి కావలసినది, ఇష్ట మైనది,చదివేను అని చెపుతాడు. ఇది ఆధునిక కాలానికి కుడా పనికివచ్చే సమాధానం. 'తల్లిదండ్రులు తమ అభిరుచికి తగినట్లు కాకుండా, పిల్లల అభిరుచికి తగిన చదువు చెప్పించడం మంచిది.' అనే మంచిమాటని ఆనాడే ప్రహ్లాదుడు చెప్పాడు. ఇంకా, 'కానని వానినూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కాననిభంగ' న్న పద్యంలో గుడ్డి వాడు గుడ్డి వాని సాహాయం తీసుకొంటే ఏది చూడలేడు. ఆ విధంగా గురువులు చెప్పిన విద్య ఉన్నదని తెల్పి, అది చదివితే 'అంధేదూదయముల్, మహాబధిర శంకారావముల్, మూకస గ్రంధాఖ్యాపనముల్, నపుంసక వధూ కాంక్షల' అన్న పద్యంలో గుడ్డివానికి చంద్రోదయము, చెవిటివానికి శంఖధ్వని,మూగ వానిని పుస్తకం చదవమని చెప్పడం, వరాహానికి (పందికి) మంచి గంధం పూయడం ఇట్టివి వ్యర్ధమైన కార్యాలు.


అట్లే శ్రీహరిని గూర్చి తెల్పేదే సద్విద్య అని,మిగిలినవి వ్యర్ధమైనవి అని తండ్రితో,' హరిన్ నమ్మి యుండుట భద్రంబంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా”అని తెల్పి,ఇంకా శరీరం,మనసు,ఇంద్రియాలు,బుద్ధి అన్నీ ఆపరమాత్మ కోసం వినియోగించాలని,ఇల్లనే చీకటి బావిలో ఈదులాడుతూ,మతిభ్రమించిన వారివలే ఉండక అఖండం, అభిన్నం,ఆనందమయం అయిన బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని,అదే సరియగు విద్యయని,మిగతా విద్యలు నేర్చుకొంటే 'అంధ కరదీపికా న్యాయం'లా పనికి రావని.తండ్రికి వివరించి,అనేక బాధలు అనుభవించి, తాను నమ్మిన శ్రీహరివల్ల రక్షింపబడి, భక్తులలో అగ్రగణ్యుడుగా కీర్తింప బడతాడు.ఇది అందరికి తెలిసిన కథ.(భాగవతం చదివి పూర్తిగా తెలుసుకోగలరు.) దీని వలన సత్ అసత్ అనేవి తెలుసుకొని,సత్ ని ఆచరించి,అసత్ ని వదలాలని. అసత్తుని ఆచరిస్తే పై న్యాయంలో చెప్పినట్లు పనికిరాకుండా పోతుందని తెలుసుకోవాలి. ఇంకా ఈన్యాయాన్నిమరికొన్ని విశేషాలతో వివరిస్తాను. భగవత్స్వరూప నిరూపణకు శబ్దం ముఖ్యమైనది. దీనినే శబ్ద బ్రహ్మ అని వేదం తెల్పుతుంది. ఈ శబ్ద బ్రహ్మకి. “పరా, పశ్యంతీ, మధ్యమ, వైఖరి అని నాలుగు ముఖాలు. ఈ శబ్దం నాభి, హృదయం, గొంతులో ఉండే స్వర పెటికా, నాలుకల ద్వారా అక్షరాల రూపంలో వెలువడుతుంది. 'అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్త్వం యదక్షరం వివర్తతేర్ధ భావేన ప్రక్రియా జగతో యత:' పూర్వ కాలం నుంచి శబ్ద బ్రహ్మ అక్షర రూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉందని ఉపనిషత్తు వివరిస్తుంది. అందుకనే గీతలో పరమాత్మ 'అక్షరాణామకారోస్మి' అనగా అక్షరాలలో ఆకారాన్ని నేను. అనితెల్పి అకార, ఉకార, మకారాలకి ఆవల తీరంలో ఉన్న ఓం కారమే శబ్ద బ్రహ్మ స్వరూపమని, అది 'ఆది,మధ్య,అంతం లేనిది, లోపల బైట అంతటా ఉండునది, ఈ సమస్త బ్రహ్మాండాల చలనంలో(భ్రమణం లో) ప్రతిధ్వనించేది ఏదైతే ఉందో అదే ఓంకారం, అదే శబ్ద బ్రహ్మమ'. అని ఉపనిషత్తు తెల్పుతుంది. ఈ అక్షరాల ఉత్పత్తిని పాణిని అనే ఋషి ఎంత చక్కగా వివరించారో చుడండి. 'అకుహ విసర్జ నీయానాం కంట; ఇచుయశానాంతాలు, ఋ టురషానాం మూర్దా' లుతు లసానాం దంతాః మొదలైన సూత్రాల ద్వారా, అనగా ఆ కారం, హకారం గొంతుక నుండి, ఇకారం, చకారం నాలుక దంతాలను తాకడంవల్ల, ఋ కారం, ట కారం శిరస్సు నుండి, ఉకారం, పకారం పెదవులనుండి, జ్ఞాకార, నకార, ణకార, మకారాలు నాసిక అనగా ముక్కునుండి' ఇలా అక్షరాలన్నీ నాభి నుండి బయలు దేరిన వాయువు (గాలి ) స్వరపేటికను తాకి ఆయా స్ధానాల నుండి బయటకి వచ్చినపుడు,అక్షరాలు పుడతాయని,ఆధునిక విజ్ఞానం(లింగ్విస్టిక్ సైన్స్) తెల్పిన దానికన్నా ముందే అంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే “అక్షర బ్రహ్మగా”దీనిని వివరించారు. ఇట్టి అద్భుత విషయాలను తెలుసుకొని, మానవుడు 'సర్వ మానవ కల్యాణానికి' పనికి వచ్చే సద్విద్యను తెలుసుకోవాలి, కాని అసద్విద్య (పనికిరానిచాదువు) నేర్చుకొంటే 'అందకరదీపికా' న్యాయం లా వ్యర్ధం అని ఈన్యాయం తెల్పుతుంది.

జలాక్షర ,శిలాక్షర న్యాయం

ఇవి రెండు న్యాయాలు. కాని ఒక్కటిగా వివరిస్తాను. జలాక్షరం అంటే = నీటిమీద వ్రాతలు. శిలాక్షరం అంటే= శిలపై వ్రాసే వ్రాతలుఅని అర్ధం. నీటిమీద ఎంత వ్రాసినా,ఎన్నిపర్యాయాలు వ్రాసినా అవి కనబడవు, నిలబడవు. అదే శిలపై వ్రాస్తే శాశ్వతంగా ఉంటాయి.అని ఈన్యాయానికి అర్ధం. అనగా మనం ఏపని చేసినా,ఎదిచేప్పినా నిలకడగా,శాశ్వతంగా ఉండాలి.కాని జలాక్షరాలలా అప్పటికప్పుడు నశించేదిగా ఉండకూడదు. దీనిని ఓ చక్కని కథద్వారా వివరిస్తాను. మనకి దానానికి “కర్ణుడు” త్యాగానికి “రంతిదేవుడు, శిభి చక్రవర్తి” వంటి వారి గాధలు తెలుసు,కాని పరోపకారానికి తన శరీరాన్నే త్యాగం చేయదలచిన “జీముతవాహనుడు”అనే విద్యాధరుని కథ కొద్దిమందికి మాత్రమె తెలుసు. దానిని తెలుసుకొందాం. ఈకథ “శ్రీహర్ష దేవుడు రచించిన నాగానందం” అనేనాటకం లోనిది. (నైషధం వ్రాసిన హర్షుడు కాదు.) “జీమూతకేతువు అనే విద్యాధరచక్రవర్తి కుమారుడు “జీమూతవాహనడు” అతడు రాజ్య సుఖాలను విడచి, వృద్ధులైన తన తల్లి దండ్రుల సేవచేసుకొంటు, మలయ పర్వత ప్రాంతంలో నివశిస్తూ ఉంటాడు. అతని మంచి స్వభావాన్ని,గుణ గణాలను తెలుసుకొన్న ఆ ప్రాంతాన్ని పాలించే రాజు తన కుమార్తె అయిన “మలయవతి”ని అతనికిచ్చి వివాహం చేస్తాడు. మలయవతి పార్వతి దేవి భక్తు రాలు. వివాహ వేడుకలు జరుగుతుండగా, ఒక రోజు జీమూతవాహనడు తన బావమరిది అయిన “విశ్వావసువు”తో కలసి సముద్ర విహారానికి వెళ్తాడు. అప్పుడు కొంచం దూరం లో ఉన్న తెల్లని కొండలాంటి గుట్టని చూసి “అదేమిటి” అని అడుగుతాడు. “అవి పాముల ఎముకల గుట్ట.”అనిచేపుతాడు.”అయ్యో అన్ని పాములు ఎలాచనిపోయాయి, ఏమా కథా” అని జీమూతవాహనుడు ప్రశ్నించగా? విశ్వావసువు ఇలా చెపుతాడు. “పాములకి విరోధి అయిన గరుత్మంతుడు ప్రతిరోజు సముద్రం లోంచి నాగలోకానికి వెళ్లి అధిక సంఖ్యలో, పాముల్ని పట్టితెచ్చి ఆ కనబడే గుట్టపై పెట్టి తినేవాడు. వాటి ఎముకలే తెల్లగా కొండలా కనబడుతున్నాయి. గరుత్మంతుని వలన సర్పజాతి మొత్తం నశిస్తుందని గ్రహించిన సర్ప రాజు వాసుకి, గరుడునితో “ ఇలా చేస్తే కొద్ది కాలంలోనే సర్ప జాతి మొత్తం నశిస్తుంది,అపుడు నీకు ఆహారం ఉండదు కావున,రోజుకో సర్పాన్ని నేనే నీవద్దకు పంపుతాను,నీవు ఇక్కడికి రానవసరం లేదు నీవు రోజు భుజించే వధ్యశిల వద్దకి నీకు ఆహారం అయిన సర్పం ఎర్రని వస్త్రాలు ధరించి మానవ రూపంలో వస్తుంది.నీవు శ్రమ లేకుండా భుజించ వచ్చు” అని ఒప్పందం చేసుకొంటాడు.అప్పటినుండి, ఇప్పటివరకు రోజుకో సర్పం గరుడునికి ఆహారంగా వస్తున్నది. వాటి ఎముకలే ఆ తెల్లని గుట్టలు”అని సవివరంగా వివరిస్తాడు. అదే సమయంలో ఒక భటుడు వచ్చి ఎర్రని పట్టు వస్త్రాలు వివాహ సందర్భంగా మామగారు పంపేరు అని చెప్పి,జీమూతవాహనునికి ఇచ్చి,మిత్రా వసువును తండ్రిగారు పిలుస్తున్నారు. అనిచెప్పి వెళ్ళిపోతాడు. జీమూతవాహనుడు తాను ఇంకా సముద్ర తీరంలో విహరిస్తాను అని తెలపగా,సరే అని తెల్పి మిత్రావసువు వెళ్ళిపోతాడు.నాగులకు కలిగిన కష్టాన్ని తలచుకొని బాధపడుతూ, పరోపకార పరాయణుడైన జీమూతవాహనుడు“ఒక్కనాగునైన తాను రక్షించ గలిగితే, తన జన్మ ధన్యం”అని అనుకొంటాడు. అదే సమయంలో ఒక తల్లి తనకుమారుని పట్టుకొని,ఏడుస్తూ సముద్రంలోంచి ఒడ్డుకి రావడం చూసిన, జీమూతవాహనుడు వారివద్దకు వెళ్లి “ఎందుకు ఏడుస్తున్నావు”అని తల్లిని అడుగుతాడు.”తాము నాగులమని,తన ఒక్కగానొక్క కుమారుడైన శంఖచూడుడు వాసుకి ఆజ్ఞానుసారం ఈరోజు గరుడునికి ఆహారంగా పంప బడ్డాడని మరణించ బోయే తన కుమారుని చూసి రోదిస్తున్నాను.” అని చెప్తుంది.” అప్పుడు జీమూతవాహనుడు “తల్లీ నీకుమారుని బదులు నేను గరుడునికి ఆహారంగా వెళ్తాను.నీవు సంతోషంగా ఉండు”అని అంటాడు. అపుడు శంఖచూడుడు “మహానుభావా!( “జాయంతే చ మిర్యంతే చ మాద్రుశాః క్షుద్ర జన్తవః”) నావంటి క్షుద్రులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు,కాని మీవంటి మహాను భావులు అరుదుగా జన్మిస్తారు. మీరు జీవించి ఉండాలి.”అనిపలికి తల్లితో “అమ్మా గరుడుడు వచ్చే వేళ అయింది.నీవు ఇంటికి వెళ్ళు, నేను దగ్గరలో నున్న గోకర్ణ క్షేత్రంలో ఉన్న అమ్మవారిని దర్శించి,వధ్య శిలకు వెళ్తాను”.అని చెప్పి ఇద్దరు నిష్క్రమిస్తారు.


జీమూతవాహనుడు తానే ముందుగా వధ్య శిలవద్దకు వెళ్లి, తాను కనపడకుండా, మామగారు పంపిన ఎర్రని వస్త్రాలు కప్పుకొని సిద్దంగా ఉంటాడు. అప్పుడు గరుడుడు వచ్చి, తన ఆహారం సిద్దంగా ఉందనుకొని ముక్కుతో పొడుస్తూ, తినడం ప్రారంభిస్తాడు.”పరోపకారార్థమిదం శరీరం.”అన్నట్లు తనశారీరం ఉపయోగ పడుతోందని జీమూతవాహనుడు ఆనందిస్తూ బాధని భరిస్తూ కదలకుండా ఉంటాడు. రొజూ తను భుజిస్తూ ఉంటె ఆహాకారాలు చేసే నాగుడు ఈరోజు కదలక,మెదలక బాధని భరిస్తూ ఉండడం చూసి గరుడుడు ఆశ్చర్యపడి, తినడం ఆపి “ఎవరు నీవు? సర్ప జాతి వాడవు మాత్రం కావు, ఎందుకు నాకు ఆహారంగా వచ్చావు.”అని అడుగుతాడు.


అదే సమయంలో దూరం నుంచి శంఖచూడుడు “అగు గరుడా! ఆగు,నీఆహారాన్ని నేను, అతడు విద్యధరచక్రవర్తి కుమారుడు,జీమూతవాహనుడు ,నాకోసం తన ప్రాణాలని అర్పిస్తున్నాడు,అతనిని భుజింప వలదు”. అని గట్టిగా చెప్తూ దగ్గరకి వస్తాడు, తన తప్పు తెలుసుకొన్న గరుడుడు జీమూతవాహనుని త్యాగ శీలతని మెచ్చుకొని వరం కోరుకోమంటాడు.ఇకపై నాగులను భక్షింప వలదని, ఇంకా అమృతం తెచ్చి నీవల్ల మరణించిన నాగులను బ్రతికించ మంటాడు. వరాన్ని కుడా ఇతరులకోసమే ఉపయోగించిన జీమూతవాహనుని గొప్ప గుణానికి సంతసించిన గరుడుడు వెంటనే స్వర్గానికి వెళ్లి,అమృతాన్ని తెచ్చి ఆఎముకల గుట్టపై మరియు జీమూతవాహనునిపై చిలకరించి అందరిని బతికిస్తాడు. నాగులందరు జీమూతవాహనుని కీర్తిస్తూ ఆనందంగా తమనివాసాలకి వెళ్ళిపోతారు.” ఇది జీమూతవాహనుని కథ.నాగులకి అనందం కలిగింది కనుక దీనికి “నగానందం”అని హర్ష దేవుడు పేరుపెట్టాడు. కొన్ని వందల సంవత్సరాలకి ముందు రచించిన ఈకథ ఇప్పటికి,”శిలాక్షర న్యాయం”లా శాశ్వతంగా ఉంది. ఆధునిక సాహిత్యంలో “భావకవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవ,దిగంబర, కథ, గేయ, వచన, ఇలా ఎన్నో, ఎన్నెన్నోవివిధ సాహిత్య ప్రక్రియలు వచ్చి, మార్పులు చెందుతున్నాయి కాని “ప్రాచీన సాహిత్యం” అలాగే శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది.అని తెల్పేదే “శిలాక్షరన్యాయం.” ఆధునిక కాలంలో వచ్చే కొన్ని సాహిత్య ప్రక్రియలు కొంత కాలం ప్రభావాన్ని చూపి నశించిపోతుంటాయి.”వాటిని జలాక్షర న్యాయంతో “పోల్చవచ్చు.నీటిమీద వ్రాతల్లా అవి కనపడకుండా పోతాయి.అట్టి వాటిని వివరించనవసరం లేదు. కనుక ఈ న్యాయాలని ఇంతటితో ముగిస్తున్నాను.

శ్వాన పుచ్ఛ న్యాయం

శ్వానం= అనగా కుక్క.పుచ్చం= అనగా తోక కుక్కతోక అనిఈన్యాయానికి అర్థం. ఇదే తెలుగులో “కుక్కతోక వంకర”అని వాడుక. కుక్క తోకని తిన్నగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దాని వంకరపోదు.”ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు.”అని వేమన అన్నట్లు, వంకర గుణాలు,వక్ర బుద్ధి ఉన్నవారిలో ఎంత ప్రయత్నించినా మార్పు రాదు. ఈశ్లోకం చూడండి. “పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః” సహజంగా మానవులు పుణ్యం చేయరు కాని, పుణ్య ఫలాన్ని కోరుకొంటారు.కావాలని పాపం చేస్తార.ు కాని పాప ఫలం కోరుకోరు. ఎంత విచిత్రం! మనిషికి కావలసిన సుఖం,అనందం కేవలం డబ్బు సంపాదనవల్ల మాత్రమే అనుకొంటారు.కాని చిన్ని,చిన్నిసంఘటనల వల్ల కుడా ఆనందాన్ని పొందవచ్చు.అని అనుకోరు. ఉదా:-“కుటుంబంలో అందరుకలిసి వెన్నెట్లో కూర్చొని మాటాడుకోవడం, కలసి భోంచేయడం, చిన్నపిల్లల బోసినవ్వులు చూడడం, వాళ్ళతో కలసి ఆడుకోవడం, వనవిహారం చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, మంచివారితో స్నేహం చేయడం, వికసించే పుష్పాలు, జలపాతాల గలగలలు, పక్షుల కిలకిలా రావాలు,నక్షత్రాల మిలమిలలు, ఉదయ కాలంలోఆకుమీద పడి క్రిందికి జారే మంచు బిందువు సోయగాలు, తొలకరి జల్లు భూమిపైన పడినపుడు వచ్చే మట్టి వాసనలు, ఇలాంటి ఎన్నో, మరెన్నో ప్రకృతి లోని అందాలని ఆస్వాదించడం వంటి వాటి వల్ల కుడా ఎంతో ఆనందాన్ని, సుఖాన్ని పొందవచ్చు.అన్నిటికి మించి “తృప్తి”కి మించిన ఆనందం మరొకటి లేదు. “తృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపంబునైన చక్కంబడునే” అంటాడు పోతన. కాని ఈనాటి సమాజంలో మానవుడు దురాశకు పోయి, వక్ర మార్గంలో ధన సంపాదన చేస్తూ, కష్టాలని,అనారోగ్యాన్ని, అశాంతిని కొని, “నిజంగానే డబ్బుతో కొని” తెచ్చు కొంటున్నాడు. ఎన్ని సుభాషితాలు విన్నా,వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు “దురాశ”ను గురించి వివరించినా “శ్వానపుచ్ఛ” న్యాయంలా బుద్ధిని మార్చుకోటం లేదు. ఈ దురాశను గూర్చి చిన్నకధ చెప్తాను. ”పూర్వం ఓ బాటసారి తన ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడానికి ఓ అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ, ఎండ ఎక్కువగా ఉన్నందున అలసిపోయి, దారిలో ఉన్న ఓ చెట్టుక్రిందకి వెళ్లి కూర్చుంటాడు. కొద్ది సమయం అయ్యాాక మనసులో కోరికలు కలగడం ప్రారంభం అవుతాయి. అవి ఇలా ఉంటాయి. “ చాలా దాహంగా ఉంది, చల్లని నీళ్ళు ఉంటే బాగుంటుంది అనుకొంటాడు. అతడు కూర్చున్న వృక్షం “కల్పవృక్షం”వంటి దేవతా వృక్షం. దాని క్రింద కుర్చుని ఏదికోరితే అది జరుగుతుంది. ఆ సంగతి బాటసారికి తెలియదు. అతడు నీళ్ళు కోరేడుకదా! వెంటనే అతని ముందు ఒక పాత్రలో నీళ్ళు ప్రత్యక్షం అయాయి. అతడు ఆశ్చర్యపడి, వాటితో దాహం తీర్చుకొంటాడు. తరువాత దాహం తీరింది, మంచి భోజనం ఉంటే ఆకలి కుడా తీరుతుంది అనుకొంటాడు. వెంటనే పంచ భక్ష్యాలతో భోజనం వస్తుంది. హాయిగా భుజిస్తాడు. వెంటనే నిద్ర వస్తోంది మంచం పరుపు ఉంటే బాగుంటుంది కదా! అని అనుకొంటాడు.అవి కూడా వస్తాయి.ఆశ అధికం అయితే దురాశ అవుతుంది. ఆహా మంచం పరుపూ ఎంత సుఖంగా ఉన్నాయి, ఇప్పుడు నాభార్య పక్కన ఉండి సపర్యలు చేస్తుంటే ఇంకా ఎంతో సుఖంగా ఉంటుంది కదా! అనుకొంటాడు. వెంటనే భార్య ప్రత్యక్షం అవుతుంది. (అంతటితో ఆ బాట సారి ఊరుకోవచ్చు కదా!) అరె! నిజంగా ఇది నా భార్యా లేక ఏదో భూతం నన్ను తింటుందేమో! అనుకొంటాడు. వెంటనే అతడి భార్య దెయ్యంగా మారి అతడిని మింగి మాయం అవుతుంది.” దురాశ దు:ఖానికి చేటు. అన్నదానికి ఈ కథ చక్కని ఉదాహరణ. మనసులో ఒక చెడ్డ ఆలోచన ఉంటే దానిని ఎవరూ పోగొట్టలేరు. అని పై న్యాయం చెపుతుంది. పెద్దలు చెప్పిన మరో చిన్న పురాణ గాధ ద్వారా ఈన్యాయాన్ని ఇంకా వివరిస్తాను.(ఇది కల్పిత కథ) “రావణుడు సీతని తెచ్చి లంకలో ఉంచుతాడు.విభీషణుడు, కొంతమంది మంత్రులు, మండోదరి,చివరికి కుంభకర్ణుడు కూడా, సీత విషయంలో తప్పుచేసావు అంటే ఒప్పుకోడు.రామునితో యుద్ధానికి కూడా సిద్దపడతాడు.ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ సమయంలో ఒకసారి పాతాళ లోకంలో ఉన్న ప్రహ్లాదుని మనుమడు, తన ముత్తాత అయిన “బలిచక్రవర్తి” వద్దకు రావణుడు వెళ్తాడు. ముని మనుమని రాకకి బలి సంతసించి కుశల ప్రశ్నలు వేసి ఇలా అంటాడు.”రావణా నా పూజా మందిరంలో ఒక చేతి కంకణం ఉంది, దానిని కొంచం తెచ్చిపెట్టు” అంటాడు.అలాగే అని రావణుడు పూజా మందిరంలోకి వెళ్లి,”రత్న ఖచిత సువర్ణమయ” కంకణాన్నిచూసి దానిని తీయ బోతాడు, కాని అది పైకి లేవదు. రెండు చేతులతో పట్టుకొని ఎత్తబోతాడు, కొంచం కూడా కదలదు. ఆశ్చర్యపడి తన బలమంతా ఉపయోగిస్తాడు, అయినా కూడా అది కదలదు. తాతగారి వద్దకి వచ్చి.”తాతగారు! అది ఎవరి కంకణం? కైలాసాన్నే కదల్చగలిగిన నాబలం ఆ చిన్న కంకణాన్నిఎందుకు కదల్చ లేక పోయిందో” తెలుపమని అడుగుతాడు. అప్పుడు బలి ఇలా చెపుతాడు. “రావణా! నా ముత్తాత గారు అయిన హిరణ్య కశిపుని సంహరించిన సమయంలో నృశింహ రూపంలో వచ్చిన శ్రీ హరి చేతి నుండి జారిన కంకణం అది. దానిని మా తాతగారైన ప్రహ్లాదుల వారు నాకొసంగి, నిత్యం పూజించు కోమని చెప్పారు. అట్టి పవిత్రమైన ఆ చిన్ని కంకణాన్నేకదల్చలేని నీవు శ్రీహరి అవతారమైన శ్రీరామునితో పోరాడి ఎలా గెలవగలవు., కనుక సీతని విడచి రాముని శరణు వేడు.”అని హితాన్ని చెపుతాడు బలి. గర్వ భంగం చెంది కూడా, పెద్దల మాటను పెడ చెవిని పెట్టి “శ్వానపుచ్ఛ”న్యాయంలా ఎవరిమాట వినక రావణుడు నశిస్తాడు. ఇది ఈన్యాయాన్ని వివరించే కథ. మనం మన బుద్ధిని పై న్యాయంలా ఉండకుండా జాగ్రత్తగా ఉంచుకొందాం.




94 views0 comments

Recent Posts

See All
bottom of page