top of page
Search
  • TPN Acharyulu

మీ కోసం - 2

మీ కోసం – 6

ఈ రోజు ఒక ‘నానుడిని ‘ వివరిస్తాను. “ పశ్చాత్తాపం” అనే మాటను మనం తరచుగ వింటూవుంటాంకదా? ఏదైన ఒక తప్పు చేసి, లేద యితరులను బాధించిన పిదప అది తప్పు అని తెలుసుకొని మనం బాధపడితే దాన్ని “ పశ్చాత్తాపం” ( పశ్చాత్ అనగా పిదప తాపం అంటేబాధ) అంటారు. నష్టంజరిగేక బాధపడినందువల్లప్రయోజనంశూన్యం. దీనికి ముందు “ పూర్వ తాపం” అని ఒకపదంవుంది, జరగబోయేనష్టాన్ని ముందేవూహించుకొని బాధపడడం. పశ్చాత్తాపంకంటే, పూర్వతాపమే మంచిది. వీటిని మంచి ఉదాహరణతోవివరిస్తాను. “ మహాభారత యుద్ధం జరగడానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడుని “ అచ్యుత! సేనయోః ఉభయోఃమధ్యే రధంస్థాపయ” రెండుసేనలమధ్య రధాన్ని ఉంచు, అని అడుగుతాడు. కృష్ణుడు అలాగేచేస్తాడు. అపుడు అర్జునుడు ఎదుటవున్న సైన్యంలోని— తాతలను, తండ్రులను, అన్నదమ్ములను, గురువులను, స్నేహితులను చూసి “ వీరినా నేను చంపవలసినది నావల్ల కాదు” అని బాధపడతాడు. ఇది “ పూర్వ తాపం” తరువాత కృష్ణుడు గీతను బోధించి, బాధనుపోగొట్టి యుద్ధం చేయించి, విజయం కలుగ జస్తాడుకదా! పూర్వ తాపం పొందిన అర్జునుడికి తరువాత అంతా విజయమే!! మరి దుర్యోధనుడు యుద్ధంలో అందరిని పోగొట్టుకొని, తొడలు విరిగి, నేలకూలి, మరణం ఆసన్నమైనపుడు “ అయ్యోనావల్లకదా ఇదంతాజరిగింది, ముందే సంధికి ఒప్పుకొనివుంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా?! “ అని బాధపడతాడు ఇది “ పశ్చాత్తాపం” ఎంత బాధపడినా జరిగిన నష్టం తిరిగి రాదుకదా? కనుక పశ్చాత్తాపం కంటే పూర్వతాపంమంచిది, అని పెద్దల నానుడి.

మీ కోసం – 7

వేదాలు, బ్రాహ్మణాలు ( వేదాలలో ఒకభాగం), ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు,కథలు,గాధలు అహో! ఎంత గొప్ప నిధిని పెద్దలు మనకి అనుగ్రహించేరు. ఎంత తీసిన తరగని గొప్పసంపద. అందులోనుండి రేణువంతమాత్రమే మీకు వివరిస్తున్నాను. చదివి ఆనందించగలరు. ఈరోజు “మోక్షం పొందిన మురళి “ అనే వృత్తాంతాన్ని వివరిస్తాను. సంగీతానికి వశం కాని వారు ఉండరుకదా? అందుకనే “ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి “ అంటే పిల్లలు, పశువులు, పాములుకూడ సంగీతానికి పరవసించిపోతాయి అని అర్థం. ( పైశ్లోకపాదానికి ఇంకో విశేషార్థంవుంది! వివరిస్తాను. పరమశివుడు సంగీతప్రియుడనీ, శివుని సంగీతానికి “ బాలుడైన వినాయకుడు, పశువైననందీ, శివుని మెడలో వుండేఫణి( పాము) ఆనందిస్తాయిట.! ) ఇక ప్రస్తుతాంశం—— శ్రీకృష్ణుడు మురళీగాన ప్రియుడుకదా!? గోపాలునిమురళీ రవానికి నందవ్రజంలో వుండేగోపాలురేకాదు, పశువులు, పక్షులు కూడ పరవసిస్తాయి, ఆ గానమహిమకి ఎండి మోడువారిన చెట్లుకూడ చిగురించేవిట! ఒకరోజు కన్నయ్య చేతిలో వున్న వేణువు ఆ స్వామిని ఇలా అడిగిందట. “ ఓ ప్రభూ! నానుండివచ్చిన నాదానికే మోడువారిన చెట్లు చిగురిస్తున్నాయి కదా! మరి నేనుకూడ ఎండిన వెదురు కర్రనేకదా!? నీచేతిస్పర్శేకాదు, పవిత్రమైన నీ అధర స్పర్శకూడ కలిగిన నేను ఎందుకు చిగురించ లేకపోతున్నాను? నాకు పునర్జన్మ ఎందుకు కలగడం లేదు” అన్న ఆ మురళి ఏమినోములు నోచినదో, ఎన్నితపములుచేసినదో ఆ నందనందనుని! కాదు ఆనంద నందనుని మాధురాధరస్పర్శపొందింది! తననితానుహింసించుకొని( రంధ్రాలు గ )ఆత్మార్పణ చేసికొన్న ఆ వేణువు అడిగిన ప్రశ్నకు లీలామానుషరూపుడైన ఆ స్వామి ఇలా జవాబిస్తాడు. “ నా అధర స్పర్శచే పవిత్రత చెందిన నీకు ఎవరికి లభించని జన్మరాహిత్యాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదించేను కనుక నీవు పునర్జన్మలేకుండ, పరమపదాన్నిపొందేవు “ అని అన్న ఆ నల్లనయ్య మాటలకు బ్రహ్మానందాన్నిపొందిన వేణువు “ “ధన్యోస్మిప్రభూ, ధన్యోస్మి” అని అన్న ఆ మురళి ఎంత ధన్యజీవి!!!!

మీ కోసం – 8

ఈరోజు “ రావణ గర్వ భంగం “ అనే వృత్తాంతాన్ని వివరిస్తాను. ( ఇది కల్పిత కథ) “ ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనకాది - - మహాభక్తులలో ప్రహ్లాదుడు అగ్రగామి. అట్టి ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, యితనికుమారుడే బలిచక్రవర్తి. అనగా ప్రహ్లాదుని మనవడు బలి. బలి, వామనుల చరిత్ర అందరికి తెలిసినదే! శ్రీహరినిసేవిస్తూ పాతాళంలో బలి ఉంటాడనిప్రశస్తి. అసుర వంశంలోపుట్టిన రావణుడు తన ముత్తాతగారైన బలిని చూడటానికిపాతాళానికి వెళతాడు. మునిమనవడిని సాదరంగ ఆహ్వానించి, కుశలప్రశ్నలు వేస్తాడు బలి.అపుడు రావణుడు శ్రీహరిఅవతారమైన రాముణ్ణి దూషించి, అతణ్ణిఅంతం చేస్తానని గొప్పగ చెపుతాడు. అపుడు శతృభయంకరుడైన శ్రీరామునిగొప్పతనాన్ని రావణునకుతెలపాలని తలంచినబలి “ రావణా! నాపూజా మందిరంలో అపూర్వమైన ఓ చేతికంకణం ఉంది వెళ్ళి తీసుకుర! “ అని ఆజ్ఞాపిస్తాడు. రావణుడు పూజామందిరంలో ఒక పెట్టెలో ధగధగ మెరుస్తూ కాంతులు వెదజల్లుతున్న పసిడి కంకణాన్ని చూసి చెతితో పయికితీయబోతాడు ఆ మహిమాన్వితమైన కంకణం ఒక అంగుళంకూడ కదలదు. తన బలాన్నంతా ఉపయోగించి రెండు చేతులతో ఎత్తడానికి ప్రయత్నిస్తాడు కొంచంకూడ అది కదలదు, పయికిలేవదు. చెమటలుపడుతున్న శరీరంతో మరలమరల ప్రయత్నించిబోర్లా పడతాడు. మనవడి అవస్తచూసిన బలి మనవణ్ణిలేపి, కూర్చోబెట్టి ఇలాఅంటాడు. “ నాయన! రావణా! శ్రీహరిబలాన్ని చాల తక్కువగ తలంచేవు, మన పూర్వీకుడైన హిరణ్యకశిపుని ప్రహ్లాద రక్షణార్ధం శ్రీహరి నృసింహరూపంలోవచ్చి సంహరించిన విషయం నీకుతెలుసుకదా?! ఆ యుద్ధంలో నృసింహస్వామిచేతినుండి జారి పడిన పవిత్రమైన కంకణం అది! మాతాతగారైన ప్రహ్లదులవారి నుండి దాన్ని పూజించుకొంటున్నాము, శ్రీహరి చేతికంకణాన్నే ఎత్తలేని నీవు ఆశ్రీహరి అవతారమైన శ్రీరాముణ్ణి ఎలా జయిస్తావు” అని అడుగుతున్న తాతగారికి జవాబు చెప్పలేక గర్వభంగం చెందిన రావణుడు తలవంచుకొంటాడు. ( కల్పితమైనా ఈకథ బాగుందని మీతోపంచు కొన్నాను.)

మీ కోసం – 9

“ పోతన శివుని ధ్యానం చేస్తే, రాముడు ప్రత్యక్షమయి శ్రీకృష్ణునికథలురచించమని ఆజ్ఞాపించేడుట” హరిహరాద్వైత తత్త్వం” అంటేఏమిటో మనకి వివరించేడుపోతన. అందుకే “ చేతులారంగ శివుని పూజింపడేని, నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని” అని సెలవిచ్చేడు. ( డు అనేదిగౌరవవాచకం, దేవుడు వలే.) భాగవతంలో వర్ణించిన “ లోకరక్షైకుడు, ఆనందాంగనఢింభకుని స్మరిస్తే, శ్రీ కైవల్యపదంలభిస్తుందిట. భాగవతపఠనం మోక్షానికి ఎంత సులభమార్గం. అందుకే కొన్ని క్రొత్త కథలు పఠించి తరిద్దాం. “ నౌకాభంగం “ అనే కథ వివరిస్తాను. ఇది భాగవత కథే అయినా , ‘నారద యక్షగానాల’ నుండిగ్రహింప బడింది. మధురభక్తిరసపూరితమైన గోపికావస్త్రాపహరణ ఘట్టానికి ఇంకోరూపం. “ ఒక పున్నమి రేయి గోపికలతో యమునానదిలో కన్నయ్య నౌకావిహారం చెస్తూవుంటాడు. యమునానది మధ్యకినావచేరుకొంటుంది, గోపికలందరూ నల్లనయ్య సౌందర్యాన్ని తిలకిస్తు, మురళీగానాన్ని ఆలకిస్తూతమనితాము మరచితన్మయిలైవుంటారు. నటన సూత్రధారిమురారికదా! త్రేతాయుగంనాటి భాగవతోత్తములు కదా గోపికలు! వారిని పరీక్షించ దలచి ఆనావకి రంధ్రం పడేటట్లుచేస్తాడు స్వామి. నావలోకికొంచంకొంచం నీళ్ళురావడం చూసిన గోపికలు నావ ములిగితే తమతోపాటుస్వామికూడ మునిగిపోతాడు కదా! అని భయాందోళనతో “ నావకు రంధ్రంపడి, లోపలకినీళ్ళు వస్తున్నాయి” అని కన్నయ్యకు విన్నవిస్తారు. “ మరేమి పరవాలేదు ఆరంధ్రంలో చిన్న వస్త్రాన్ని పెట్టండి” అని చెబుతాడు. ఓ గోపిక తన చీరచెంగు చింపి ఆ కన్నంలో పెడుతుంది. అయినా నీళ్ళురావటం ఆగక పోవడంతో , అక్కడ ఉన్నది తన స్వామేకదా!!అని తలచి చీరమోత్తంవిప్పి రంధ్రంలో పెడుతుంది,అయినా నీళ్ళురావటంఆగలేదు. ఇక లాభంలేదని గోపికలందరూ తమ స్వామిప్రాణాలు, తమప్రాణాలు రక్షించుకోవాలి అనే తపనతో ఒంటిమీదవున్న వస్త్రాలనువిప్పి ఆరంధ్రంలో ఉంచుతారు. అయినా నీళ్ళురావటం ఆగలేదు! తమఒంటిమీద చిన్న నూలుపోగైన లేకుండా ఇన్ని వస్త్రాలు పెట్టినా నీళ్ళు ఆగకపోవడం ఆశ్చర్యంగా ! వుందేయని ఆలోచిస్తున్న గోపికలకు హటాత్తుగ జ్ఞానోదయమౌతుంది. అపుడు చేతులు ఎత్తి నల్లనయ్య కి అంజలి ఘటించి ఇలా ప్రార్ధిస్తారు. “ ఓ లీలామానుషవిగ్రహ! అపదోద్ధారకా! మా అజ్ఞనాన్నిమన్నించు,జగద్రక్షకుడవైన నీవే మాచెంతనుండగ, మాకు ఆపద ఎలాకలుగుతుంది,? మాకు మా శరీరాలపై వ్యామోహం పోవాలని తలచి ఈ నౌకాభంగముద్వార వస్త్రాపహరణఘట్టాన్ని కల్పించేవు. నీవేమారక్షకుడవు” అని ప్రార్ధించిన గోపికలతో ఆస్వామి “ మీరందరూ పరమభక్తులు, శరీరాలమీదవ్యామోహంవిడచి, నన్నుకాపాడుకోవాలని తలచి,వస్త్రాలను విడచిన మీచర్యచాల గొప్పది.! సదా మీరందరూ నాయందనురక్తులై వుందురుగాక!” అని కటాక్షించేడుస్వామి. ఇది “నౌకాభంగ” చరిత్ర.

మీ కోసం – 10

“ లలితస్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామము” అయిన భాగవతము, మందారమకరందంకన్నా మధురమైనది. చిలుక కొట్టిన పండు మధురమైనదికదా! శుకమహర్షినోటినుండి వెలువడిన భాగవతము కూడ ( శుకము అనగా చిలుక)అమృతముకన్నా తీయనైనది. అట్టి భాగవత కధాసుధ పానం చేయడం మన పూర్వజన్మ సుకృతం. ఈ రోజుమనం “అస్కలితబ్రహ్మచారి, నిరాహారఋషి” ఎవరో తెలుసుకొందాం! “ ఒకరోజు కృష్ణపరమాత్మ గోపికలతో యమునాతీరంలో విహరిస్తూ, గోపికలకు ఆత్మ జ్ఞానాన్ని బోధించాలనితలచి, ఓ గోపికతో యిలా అంటాడు “ ఓ చారుశీలే! ఈ నదికి ఆవలితీరంలో ఓఋషి ధ్యానంచేసుకొంటూ ఉంటాడు, నాభక్తుడు అతనికి భోజన సమయం అయింది, ఇదిగో ఈపంచభక్ష్యపరమాన్నముతో నిండివున్న బుట్టను తీసుకొనివెళ్ళి అతనికి భోజనం పెట్టి రా! “ అని ఆజ్ఞాపిస్తాడు. ఆగోపికబుట్టని తీసుకొని నదివద్దకి వెళుతుంది. నదిని దాటడానికి ఎట్టి సాధనము వుండదు. అపుడు ఆ గోపిక గోపాలునితో యిలా అంటుంది. “ ప్రభూ ! నది దాటడానికి పడవకూడలేదు, నాకాయీతరాదు, ఆవలిఒడ్డుకి ఎలా వెళ్ళాలి” అని అడిగినగోపికతో ఆ నటనసూత్రధారి ఇలా అంటాడు,” ఓ సుందరి! నీవు యమున ఒడ్డుకువెళ్ళి, ‘ అస్కలితబ్రహ్మచారి శ్రీకృష్ణుడు పంపగావచ్చేను, దారియివ్వు! అని అడుగు యమున దారియిస్తుంది”అని చెపుతాడు.ఆ గోపిక స్వామి చెప్పినట్లే అడుగుతుంది. ఆశ్చర్యంగా!! యమున రెండు పాయలుగా చీలి, దారియిస్తుంది. ఆ మధ్య నుంచిగోపిక ఆవలి ఒడ్డుకు వెళుతుంది. యమున మాములుగామారి, నిండుగ ప్రవహించసాగింది. ఆశ్చర్యపోతుగోపిక ఋషివద్దకు వెళ్ళి ఆహారం పెడుతుంది. అముని షడ్రసోపేతమైన ఆహారాన్ని భుజించి, ఆ గోపికతో “ నీవు యమునవద్దకు వెళ్ళి “ నిరాహార ఋషి దారి యిమ్మని ఆజ్ఞాపించేడు దారి యివ్వుఅని అడుగు దారియిస్తుంది ఆ దారిలో ఆవలితీరానికి చేరుకో, ఆ స్వామితో నేను తృప్తిగా భుజించాను అనిచెప్పు “అని చెప్పి మరలధ్యానమగ్నుడౌతాడు. గోపిక ఋషిచెప్పినట్లే చెప్పి,ఇవతలఒడ్డుకు వచ్చి, సహచరులైన గోపికలకు జరిగిన అద్భుతాన్ని చెప్పగా అపుడు అందరూకలసి ఆ దేవదేవుని తమకుగల సందేహం తీర్చమని ఇలాఅడుగుతారు. “ ఓ ప్రభూ! పదనారువేలమంది గోపికలు,అష్టమహిషలు గల నీవు ‘అస్కలితబ్రహ్మచారివి’ ఎలాఅవుతావు? అలాగే తీసుకువెళ్ళిన ఆహారంమోత్తంభుజించిన ఆఋషి’ నిరాహారఋషి’ ఎలాఅవుతాడు. మాకేమి అర్ధంకాలేదు.” అని అమాయకంగా అడుగుతున్న గోపికలతో అఘటనఘటనాసమర్ధుడు, శిఖిపించమౌళి, గోపస్త్రీపరివేష్టితుడైన ఆగోపాలుడు ఇలాఅంటాడు. “ కంటికి కనిపించేఈజగత్తు అంతామిధ్య. ఆత్మ ఒక్కటే నిత్యము,సత్యము. ఆత్మకిరాగద్వేషాలు,ఆకలిదప్పికలు ఉండవు. ఆత్మలకేఆత్మనైన పరమాత్మనునేను. నేనుఎందరితోక్రీడించినా అస్కలితబ్రహ్మచారినే,! ఆరుషికూడనా అంశ కనుక ఎంతభుజించినా నిరాహారఋషే! ఆత్మజ్ఞానాన్నిమీకు తెలుపుటకే ఈ సన్నివేసంకల్పించేను” అని బోధించిన కన్నయ్యను మనసార కీర్తించి తరిస్తారుగోపికలు” ఇదీ కథ.

మీ కోసం – 11

గోపాలుడు గోపికలకు బోధించిన ‘ఆత్మ తత్త్వాన్ని క్లుప్తంగవివరించేను. దానినే మరింత వివరంగా తెలుసుకొందాం. “ “ ఆత్మ పరమాత్మల స్వరూపం” “ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఆత్మని వివరిస్తూ “ బాలాగ్రశతభాగస్య/. శతధాకల్పితస్యచ/ భాగోజీవః సవిజ్ఞేయః/ సచానన్త్యాయ కల్పతే”।। అనగా ఒక తలవెంట్రుకను నూరు భాగాలుచేసి, అందులో ఒకభాగాన్ని మరల నూరుభాగాలు చేస్తే అందులో ఒకభాగ పరిమాణమమే ఆత్మస్వరూపమని వివరించబడింది. ఇంకా ‘ఆత్మోపనిషత్తులో — “ ఆత్మ నలభ్యతే: ఎవరకి లభించనది, న జాయతే:పుట్టుకలేనిది, నమ్రియతే: మరణములేనిది, న శుష్యతే: తరగిపోనిది, న దహ్యతే: దహించలేనిది, న కంపతే: కంపింపబడనిది,( కంపం అనగా వణుకు) న బిధ్యతే: బేధింపబడనిది, నఛిద్యతే: ఛిద్రంచేయబడనిది. ఇంకా ఆత్మ నదేవః: దేవతకాదు, న నరః-మనిషికాదు, న తిర్యక్: జంతువుకాదు, స్ధావరోనచ: స్ధావరముకాదు: న జంగమః : జంగమముకాదు, నదేహః దేహముకాదు, న యింద్రియం: ఇంద్రియముకాదు, నైవమనః మనస్సుకాదు, ప్రాణోనః : ప్రాణముకాదు, నాపిథీః బుద్ధికాదు. అని వివరించి, వీటన్నింటికంటే అతీతమైనది, వాక్కులకిఅందనిదిఆత్మ. ఇట్టి ఆత్మలకంటే అతీతమైనవాడు పరమాత్మ.నిర్గుణ, నిర్వికల్ప, నిరామయ, నిరంజనుడు, అచించమవ్యక్తమనంతరూపుడు, సహస్రాదిత్య సంకాసుడు, అంతటావ్యాపించినవాడు, జ్యోతిస్వరూపుడుఆపరమాత్మ. మంత్రపుష్పం ఆస్వామిని “ నీవారధాన్యంగింజయొక్క సూదిగా వున్న శిఖప్రదేశంలో ‘ (తస్యాశిఖాయమధ్యే పరమాత్మావ్యవస్ధితః’ ) వుంటాడనీ,ఆయనే బ్రహ్మ, శివుడు,ఇంద్రుడు, అక్షరరూపుడు, విరాట్ రూపుడు అని వర్ణిస్తుంది. ఓంకారంలో వుండే ‘ అ’ కారమే పరమాత్మ. భగవానుడే గీతలో “ అక్షరాణాం అ కారోస్మి” అని తెలిపాడు. ఇట్టి భగవత్తత్వాన్ని తెలిపేదేభాగవతం. భాగవత కథానాయకుడు శ్రీకృష్ణుడు. కృష్ణావతారప్రణాళిక అద్భుతమైనది . రామావతారంలోఋషులు “ “ఆలింగామోభవంతః” నిన్ను కౌగలించుకొంటాముఅని అడిగితే ( పుంసాంమోహనరూపుడుకదా!) ద్వాపరంలోగోపికలుగా పుట్టి “ మాం ఆలింగధ” అని వరమిచ్చాడుట.! అట్లే ఆ స్వామిని సేవించుకోవాలని ఎవరెవరు ఎలా అవతరించేరో తెలుసుకొందాం- కశ్యపప్రజాపతి - వసుదేవుడు దేవమాత అదితి - దేవకీదేవి వసువులలో ద్రోణుడు - నందుడు ధర - యశోద నాగమాతకద్రువ - రోహిణి ఆదిశేషుడు - బలరాముడు లక్ష్మీదేవి - రుక్మిణి వసుంధర - సత్యభామ వేదమాత. - సత్య సూర్యపుత్రి - కాళింది తులసి. - లక్షణ సరస్వతి - సైభ్య రోహిణి ( ఈమె అప్సరస)- మిత్రవింద సంజ్ఞ. - రత్నమాల స్వాహ. - సుశీల పార్వతి అంశ - జాంబవతి లక్ష్మీదేవి కళలనుండి - పదునారువేలగోపికలు మన్మథుడు - రుక్మిణీపుత్రుడు ప్రద్యుమ్నుడు బ్రహ్మ - ప్రద్యుమ్నకుమారుడు అనిరుద్దుడు.

దేవతలు - పాండవులు వసువు. - భీష్ముడు సగరుడు. - శంతనుడు శంకరుడు - అశ్వత్థామ కలి. - దుర్యోధనుడు అగ్ని. - ద్రోణుడు చంద్రుడు - అభిమన్యుడు శతరూపాంశ - సుభద్ర “ విశేషాంశాలు “ వైకుంఠం - నందవ్రజం తాపసులు - వృక్షాలు పరమానందం - నందుడు ముక్తిగేహిని - యశోద బ్రహ్మతత్త్వం - దేవకి వేదార్థం. - వసుదేవుడ ఋక్కులు - గోవులు వంశం. - రుద్రుడు శృంగం. - ఇంద్రుడు బలికుమార్తె రత్నమాల - పూతకి ( ఈమెచరిత్ర మరలవివరిస్తాను. పూతకి అనాలి, పూతన కాదు) సహస్రాక్షుడు అనేరాజు - తృణావర్తుడు ద్వేషం —. చాణూర మల్లుడు మత్సరం - ముష్టికుడు దర్పము - కువలయాపీడము( ఏనుగు) మహావ్యాధి - అఘాసురుడు కాలనేమి - కంసుడు “ కృష్ణోబ్రహ్మైవ శాశ్వతః “ సాక్షాత్ పరబ్రహ్మమే - శ్రీకృష్ణుడు. వైకుంఠంనుండి, స్వర్గలోకమునుండిఇంతమందిఇన్ని రూపాలలో పుట్టి ఆ జగన్నాటక సూత్రధారినిసేవించితరించేరు.! ( ఈ ప్రణాళిక భాగవతం మరియు,బ్రహ్మ వైవర్తపూరాణంలోవివరించబడింది.) ఇంకా వీరు అవతరించడానికి కారణం. ( అధర్వణవేదం/కృష్ణోపనిషత్తు, కృష్ణయామళంలో )- “సంహారార్ధంచ శతృూణాం రక్షణాయచసంస్ధితః భూమావుత్తరితంసర్వం వైకుంఠః స్వర్గవాసినాం “ అనివివరించబడింది. కృష్ణ శబ్దాన్ని పై గ్రంథాలలోఎంత అద్భుతంగా ఋషులునిర్వచించేరోచూడండి నామభేద, వర్ణ భేదాలతో శ్రీహరి అవతరిస్తాడుట. “ యుగేయుగే నామభేదో వర్ణ భేదోఽస్యవల్లభః సుక్లపీత స్తధారక్తః ఇదానీం కృష్ణతాంగతః।।” అనేక వర్ణాలతో ( రంగులతో) అవతరించిన స్వామి ఇపుడు ‘ ‘కృష్ణ ‘ వర్ణంలో అవతరించి- - “ కృష్ణ వర్ణః కలౌశ్రీమాన్/ తేజసాంరాశిరేవచ పరిపూర్ణతమంబ్రహ్మ తేనకృష్ణఇతిస్మృతాః” శ్రీమంతుడు, అఖండతేజోరాశి, పరిపూర్ణ పరబ్రహ్మము కనుక కృష్ణుడైనాడు. ఇంకా “ కృష్ అనగా అపరిమితమైన, ణ అనగా ఆనందాన్నియిచ్చేవాడు. కృ ష్ణ శబ్దంలో ‘క’ కారము బ్రహ్మవాచకం, ‘ ఋ’ కారము అనంతవాచకం, ‘ష’కారము శివవాచకం, ‘ణ్’ధర్మవాచకం, ‘అ’ కారము శ్వేతద్వీప విష్ణు వాచకం. అనియు, ‘కృష్’ నిశ్చేష్టత్వము, ‘ ణ్’ మోక్ష బోధకం, ‘అ’ కారందాతృవాచకం, అని, ‘ కృష్’ కర్మనిర్మూలనం, ‘ణ్’ దాస్యభావం, ‘అ’ కారం ప్రాప్తి బోధకం. ఇలా ఎన్నో నిర్వచనాలు పెద్దలు వివరించేరు. “ అహో! భాగ్యమహో!భాగ్యం నంద గోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణంబ్రహ్మ సనాతనం “ అనివర్ణిస్తూ,,, ఇంత గొప్ప “ కృష్ణ “ శబ్దాన్ని నిరంతరం జపించే గో గోపీ జనులు ఎంత పుణ్యాత్ములో!!కదా! అని భాగవతం వివరిస్తుంది. కనుకనేభాగవత పఠనం “శ్రీ కైవల్య పదానికి” సులభమార్గం.

మీ కోసం – 12

“ భాగవతం తెలిసిపలకడం శూలికి,(శివునకు) తమ్మిచూలికి( బ్రహ్మకు) కష్టతరమైనపుడు,సామాన్యులకు భాగవత తత్త్వం తెలుసుకొనుట సాధ్యమా!?కనుకనే పోతన చాలవినమ్రంగా “విబుధజనులవలన విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరతు” అని చెప్పినట్లు, మనంకూడ పెద్దలుచెప్పిన భాగవతంలోని కొన్ని విశేషాంశాలను తెలుసుకొందాం. వ్యాసులవారు చెప్పిన పదునెనిమిది పురాణాలలో “ భాగవతపురాణం” కూడ వుంది.అలాగే నారద ( నార అంటే జ్ఞానము ద అనగా ఇచ్చువాడు నారదుడు.కలహభోజనుడుకాదు) ఉపదేశంతో ద్వాదశ ( 12) స్కంధాలుగ భాగవతంవ్రాసితరించేడు. పోతన దానినితెనిగించిధన్యతచెందేడు. ఈరోజు మనం బలికుమార్తె రత్నమాల ‘ పూతకి’ ఎలాఅయిందో తెలుసుకొందాం. “ స్వర్గాన్ని ఆక్రమించిన బలివద్దకు శ్రీహరి వామనుడైవచ్చి, త్రివిక్రముడై బలినణచిస్వర్గాన్ని తిరిగి దేవతలకు లభించేట్లుచేస్తాడు. ఈ కథ అందరికి తెలిసినదేకదా!? బలి యజ్ఞవాటికకు ముద్దులొలికే బాలుడిగా బుడిబుడి అడుగులతో వస్తున్న వామనుని సౌందర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య చకితులౌతారు. అక్కడున్న బలి కుమార్తె రత్నమాల ఆ బాలుణ్ణిచూసి, పుత్రప్రేమకలిగి “ ఇలాంటి పుత్రుడు నా స్తన్యపానముచసిన నాజన్మధన్యతచెందునుకదా।” అని అనుకుంటుంది. ఆ వడుగు అది గ్రహించి తథాస్తుఅని మనసులో దీవిస్తాడు. ఆ కోరిక తీరడానికి ద్వాపరంలో రత్నమాల పూతకిగా పుట్టి, బాలగోపాలునికి “స్తన్యమిచ్చి” మోక్షాన్ని పొందుతుంది. ఆస్వామి కరుణ ఎంతగొప్పదో కదా!!. అందుకే కామంతోగోపికలు, వైరంతో కంసుడు, శిశుపాలుడు, సఖ్యంతో పాండవులు ఆస్వామినిసేవించి తరించేరు. ఇంకా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన“తనుహృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్”- అనేపద్యంలోతొమ్మిది భక్తి మార్గాలుమనకికనబడతాయి వాటికిఉదాహరణగా *** శ్రవణానికి - పరీక్షిత్తు కీర్తనానికి - నారదుడు స్మరణానికి - ప్రహ్లాదుడు, శుకుడు పాదసేవనానికి - లక్మణుడు అర్చనకు. - అంబరీషుడు,పృధువు వందనానికి - అక్రూరుడు దాస్యానికి - హనుమ సఖ్యానికి - అర్జునుడు, కుచేలుడ ఆత్మనివేదనానికి- బలి,గోపికలు కనబడుతారు. అట్లే భాగవతం జన్మకికారణమైన వాయుతత్వాలను చాలచక్కగా వివరించింది- 1. సమానవాయువు శుక్లాన్నిపురుషుడిలో 2. వ్యానవాయువు స్త్రీలో శోణితాన్ని పుట్టిస్తుంది 3. అందులోకి ప్రాణవాయువుప్రవేసిస్తుంది 4. ప్రాణశుక్లాలలో అపానవాయువు నడుస్తుంది 5. ప్రాణాపానాలమధ్య ఉష్ణ రూపంలో (అగ్ని) ఉదానవాయువుప్రవేశిస్తుంది. ఇలా పంచప్రాణాలు ( వాయువులు) మనల్నిరక్షిస్తూఉంటాయి. అగ్ని వాయువు వరుణుడువీటికతీతమైనదే బ్రహ్మతత్త్వం అదే కృష్ణతత్త్వం”అని భాగవతం వివరిస్తుంది.

"మంగళం మంగళానాంచ / మంగళం మంగళ ప్రదం సమస్త మంగళాధారం / తేజోరూపం నమామ్యహం " మంగళ ప్రదుడైన శ్రీకృష్ణ లీలా తరంగాలలో ఒక తరంగాన్ని ఆవిష్కరిద్దాం. " బాలగోపాల తరంగం " లీలామానుష విగ్రహుడు, నవనీత చోరుడు, ఆ నందాంగనా డింభకుడు అయిన గోపాలబాలుని ఆనంద తరంగాలు ఆశ్చర్య జనకాలు. ఒకరోజు గోపకాంతలు యశోద వద్దకు వచ్చి, " అమ్మా యశోదా ! నీ చిన్ని కృష్ణుడు మా ఇండ్లలో వెన్నఅంతా ఆరగించేడు " అని విన్నవిస్తారు. యశోద కన్నయ్యను పిలచి, బెదరించి " వెన్నదొంగలించావా? లేదా? " అనిఅడుగుతుంది. " నేను వెన్న తిన్నానా ! లేదే !' అని ఆశ్చర్యంగా అడిగి ఆరోజుకి తప్పించు కొంటాడు. ఇంకో రోజు వాళ్ళ యింట్లోనే వెన్నతింటూ తల్లికి దొరికి పోతాడు.నల్లనయ్య వెన్నతిన్నాడు , తల్లి చూసింది, ఇపుడు ఎలాగైనా తల్లిని మాయచేసి వెన్న తిన లేదని నిరూపించాలి. ఇది కన్నయ్య ఎత్తుగడ! వారి మధ్య సంభాషణ ఎంత మనోహరంగా సాగిందో చూడండి! ( ఇది కల్పితం) తల్లి :- కన్నయ్యా! వెన్న తిన్నావా లేదా? అని అడుగుతుంది. కన్నయ్య: అమ్మా! " నేను వెన్న తిన్నానా! ( ఈ పదం గమనించండి) లేదే " అని అమాయకంగా అంటాడు. " కన్నయ్యా! నీవు తినడం నేను చూసాను"అంటుంది తల్లి. ఇక లాభంలేదు గట్టిగా చెప్పాలని అనుకొని, " ఏంటమ్మా! నేను వెన్నతిన్నానా? అసలు అంత సమయం నాకెక్కడిది! ఉదయం నీవు పెట్టిన, చద్దన్నం తిని, గోవులవెంట వెళ్ళి, మురళి వాయించుకుంటూ సాయంకాలం వరకు తిరిగి, యిప్పుడే కదా వచ్చాను,నేనెపుడు వెన్నతిన్నాను? " అని ఓ కారణం చెపుతాడు. అయినా యశోద కోపంగా చూస్తూ తర్జనితో ( చూపుడువేలు) బెదిరిస్తుంది.అమ్మ తనమాట నమ్మలేదని గ్రహించిన ఆ బాలగోపాలుడు ఇంకో కారణం చెపుతాడు. " అమ్మా! నేనువేన్నతిన్నానా!? లేదమ్మా లేదు. చూడు నావి ఎంత బుల్లి,బుల్లి చేతులో, అంత ఎత్తు ఉట్టిమీద భాండంలో ఉన్న వెన్నని,అందుకొని ఎలాతినగలను!? ఇపుడు చెప్పూ , నేను వెన్న తిన్నానా!?" అని అమాయకంగా ముద్దుమోముతో అడుగుతున్న ఆ చిన్ని కన్నయ్యని చూసి ముసి,ముసిగా నవ్వుకొంటూ యశోద " ఇదిగో కన్నయ్యా! అసత్యం ఆడకు, నువ్వు వెన్న తినకపోతే నీ మూతికి అంటుకొన్నది ఏమిటి?" అని గట్టిగా అడుగుతుంది. అయ్యో! దొరికిపోయానే ! ఇప్పుడు ఎలా? అనిఅనుకొని, పైకి ఘంభీరం ప్రదర్శిస్తూ, " ఓ అదా బైట ఆవులకి పాలుపితుకుతున్నారు, నేను దగ్గరగా నిలుచున్నాను, ఆ పాలనురుగు నా మూతికి అంటింది . ఇది వెన్నకాదు. ఇపుడు చెప్పూ నేను వెన్న తిన్నానా?" అని అంటాడు. అయినా అమ్మ ఒప్పుకోదు. ఈ కారణం కూడా తల్లి నమ్మలేదు, కొంచం అమ్మని పొగిడి ఒప్పిద్దాం, అనుకొని " ఓ అమ్మా! నా బంగారుతల్లి! ఓ అందమైన అమ్మా! నా ప్రియమైన అమ్మా! నను గన్న నాతల్లీ! మా మంచి అమ్మ! " అని ఎంత పొగడినా తల్లి నమ్మటం లేదని,కొంచం తెచ్చి పెట్టుకొన్న కోపంతో " ఎంటమ్మా! ఎంత చెప్పినా వినవు. ఉదయమే నాచేతికి,ఒక కర్రా, కంబళి యిచ్చి పంపుతావు అబ్బో గోవులను కాయడం ఎంత కష్టం ! ఇక ఈ పని నావల్లకాదు. ఇదిగో నీకర్రా, కంబళి నీవే తీసుకో రేపటినుంచి ఎక్కడికి వెళ్ళను. ఇపుడు చెప్పు నేను నిజంగా వెన్న తిన్నానా!? " అని చివరికి దీనంగా ముఖం పెట్టి అడుగుతున్న కన్నయ్యని --అక్కున చేర్చుకొని, కళ్ళవెంట భాష్పాలు రాగా గద్గద స్వరంతో యశోద " నా చిన్ని తండ్రీ లేదయ్యా! లేదు. నువ్వు వెన్న తినలేదు" అని గట్టిగా అంటుంది. అమ్మయ్యా! అమ్మ నమ్మింది ఇక ఈ వినోదం చాలు అనుకొని ఆ లీలా మానుష విగ్రహుడు తల్లి కన్నీళ్లు తుడిచి, " అమ్మా! ఇంతవరకు నేను వెన్న తిన్నానా!? అనికదా నిన్ను విసిగించేను. ఇపుడు నిజం చెపుతాను విను. నేను వెన్న తిన్నాను." అని ముద్దుముద్దుగా చెపుతున్న i కన్నయ్యను ముద్దిడి, తల్లి యశోద " నాకు తెలుసు కన్నా! నీవు సత్య స్వరూపుడవు " అని అంటుంది.

203 views0 comments
bottom of page