top of page
Search
  • TPN Acharyulu

సాహిత్యంలో- చాటువులు

సంస్కృతాంధ్ర సాహిత్యాలలో చమత్కార శ్లోకాలు, పద్యాలు కోకొల్లలు. వీటినే చాటువులు, హాస్యోక్తులు, వ్యంగ్యోక్తులు, సరసోక్తులువంటి వివిధ పేర్లతో, మనసుకి ఉల్లాసం కలిగించే ప్రక్రియలుగా చెప్పవచ్చు..

-- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి. నరసింహాచార్యులు.



తెలుగులో శ్రీనాధుని పేరుతో అనేక చాటువులు సుప్రసిద్ధాలు. ఉదాహరణకి “ పరమేశా గంగనిడుము పార్వతి చాలున్” అనగా- ఓ! ఈశ్వరా నీకు ఇద్దరు భార్యలెందుకు పార్వతిని ఉంచుకొని, గంగని విడిచిపెట్టు. అని శ్రీనాధుడు వానలు కురవని పల్నాటి సీమలో పలికినట్లు చెప్పబడింది.(దీనిని తరువాత వివరిస్తాను) ఇట్లాంటి తెలుగు చాటుపద్యాలవంటివే, సంస్కృతంలో చమత్కారయుతమైన శ్లోకాలు చాల ఉన్నాయి. వీటిని ఎవరు వ్రాసారో తెలియదు కాని కొన్ని కాళిదాసాది కవుల పేరుతో ప్రాచుర్యం పొందాయి. ముందుగా ముఖ్యమైన కొన్ని సంస్కృత చాటువులని వివరిస్తాను. పఠించి ఆనందించండి.


 

సాహిత్యంలో చాటువులు 1


“అహమేకశత వ్యాఘ్రాన్/ పంచ వింశతి కుంజరాన్ ఏక సిహం నభక్ష్యామి/ గడ్డం వపనముత్యతే”


ఈ సంస్కృత చాటువు మనందరికి తెలిసిన “మేక పోతు గాంభీర్యం” అనే తెలుగు సామెతకు సంబంధించిన కథను తెలుపుతుంది. ఈ కథ తెలుగువారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన “పెద్దబాలశిక్ష” అనే పుస్తకంలో కూడ ఉంది. ఇక వివరణ--

ఎవరైనా లోపల భయపడుతూ,పైకి గంభీరంగా కనపడుతూ, డాంబికంగా మాటాడేవారి విషయంలో ఈ సామెతని ఉపయోగిస్తారు. “వాడు చూడండి ఎలా మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో” అని.

ఇప్పుడు దీనికి సంబంధించిన కథని తెలుసుకొందాం-

ఒక కొండ పరిసరాలలో మేస్తున్న మేకలమందలోంచి ఒక మేకపోతు వేరుపడిపోతుంది. అదేసమయంలో వానవస్తుంది. వాన నుంచి తప్పించుకోవాలని పొరపాటున అది ఒక సింహంగుహలోకి వెళ్తుంది. అదృష్టవశాత్తు అప్పుడు సింహం గుహలో ఉండదు. కొంత సమయం గడిచాక సింహం గుహవద్దకి వస్తుంది. లోపల వేరేజంతువు ఉందని గ్రహిస్తుంది. సింహమైనా దానికీ ప్రాణభయం ఉంటుంది కదా! అందుకని బైటే నిలబడిపోతుంది. లోపల ఉన్న మేకపోతు సింహాన్ని చూసి గడగడలాడుతూ చచ్చానురా దేవుడా! అనుకొంటుంది. కాని కొంచం ధైర్యం తెచ్చుకొని మేకపోతుకి గడ్డం ఉంటుంది కదా! ఆగడ్డం మాత్రం సింహానికి కనబడేటట్టు గుహలో నిలబడి గంభీరమైన స్వరంతో ఇలా పలుకుతుంది. మేకపోతు పలికిన మాటలే పైశ్లోకం.


అర్థం

“అహమేక శతం వ్యాఘ్రాన్ = (నేను ఇప్పటికి) ఒక వంద పెద్ద పులుల్ని,

పంచ వింశతి కుంజరాన్ = ఇరువది ఐదు ఏనుగుల్ని తిన్నాను. ఇక,

ఏకసింహం = ఒకసింహాన్ని.

న భక్ష్యామి=తినకపోతే.

గడ్డం వపనముత్యతే=నా గెడ్డాన్ని తీయనే తీయను.” అని పలుకుతుంది.


ఆ మాటలు విన్న సింహం భయపడి పులుల్ని,ఏనుగుల్ని తిన్న ఆజంతువు ఎంత పెద్దదో! నన్ను చూసిందంటే తప్పక తినేస్తుంది అనుకొని పారిపోతుంది. “బ్రతుకుజీవుడా” అనుకొని మేకపోతు కూడా అక్కడి నుంచి పారిపోతుంది.” అందరికి తెలిసిన ఇంత చక్కని కథకి మూలం పైన చెప్పిన సంస్కృత చాటువు.

 

సాహిత్యంలో చాటువులు. 2.


మానవ మనస్తత్వ చిత్రణని తెల్పే ఓ చక్కని చాటు శ్లోకాన్ని ఈ నెల తెలుసుకొందాం.

“గొర్రె దాటు వ్యవహారం” అని తెలుగులో వాడే ఒక నానుడిని ఈ శ్లోకం వివరిస్తుంది.

ఒకగోర్రె ఎటుదారి తీస్తే మిగతా గొర్రెలన్నీ అటే వెళతాయి. అదే గొర్రె దాటు వ్యవహారం.

మన ముందువాళ్ళు ఏది చేస్తే తరువాత వాళ్ళుకూడా అదేచేస్తారు. ఎందుకు వాళ్ళు

ఆపని చేసారు దాని వలన ఏదైనా ప్రయోజనం ఉందా? లేదా? అని ఆలోచించరు.అది

మానవ నైజం. దీనినే “గొర్రె దాటు వ్యవహారం” అంటారు. “కానని వానినూతగొని కానని

వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి” అని పోతన మహాకవి చెప్పినట్లు మంచి,చెడులు

ఆలోచించకుండా గుడ్డివాడు మరో గుడ్డివాణ్ణి ఆధారం చేసికొని వ్యవహరించడం సరికాదు.

అనే భావాన్ని చక్కని శ్లోకంలో తెలిపిన కవికి నమస్సులు. ఇక శ్లోకం చూడండి----


“అహో సైకత లింగేన / భ్రష్టా మే తామ్ర భాజనం/ గతాను గతికోలోకః / న లోకః పారమార్థికః”

ముందు శ్లోక భావం తెలుసుకొందాం- “ అయ్యో ఈ ఇసుక లింగం వల్ల నా రాగి చెంబు

పోయింది కదా! లోకంలో జనులు ముందువారు ఏదిచేస్తే అదే చేస్తారు కాని, ఆ పనిలోని

పరమార్థాన్ని గ్రహించరు” అని శ్లోక భావం. దీనిని చిన్ని కథతో వివరిస్తాను.

ఓ భక్తుడు పర్వదినంరోజు(పండుగ రోజు) సముద్ర స్నానానికి వెళ్తాడు. అతని చేతిలో ఒక రాగి చెంబు ఉంటుంది. అప్పటికి ఇంకా సముద్రస్నానానికి ఎవరు రాలేదు. స్నానానికి వెళ్ళే ముందు రాగి చెంబుని ఒడ్డున జాగర్తగా దాచాలనుకొంటాడు. అందుకని ఇసుకలో చిన్నగొయ్యి చేసి ఆ చెంబుని గోతిలో పెట్టి, గుర్తుగాఇసుకని కుప్పలాగా పోగుచేస్తాడు. ఆ ఇసుక కుప్ప దూరానికి ఒక లింగాకారంలో కనపడుతుంది. తను స్నానం చేసేటప్పుడు ఆ చెంబు ఇంక ఎవరు దొంగలించలేరని అనుకొని సముద్రం లోకి స్నానానికి వెళతాడు. కాని ఇంకొఇద్దరు సముద్ర స్నానానికి వస్తూ దూరంనుంచి మొదటి వాడు ఇసుకని కుప్పలా చేయడం చూస్తారు. చెంబుదాచుకోడానికి అలాచేసాడని గ్రహించక, సముద్రస్నానానికి వెళ్లేముందు ఇసుకని శివలింగంలా చేసి సముద్రస్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది,అదే ఆచారం అనుకొని మొదటికుప్ప ప్రక్కనే వాళ్ళిద్దరూ మరోరెండు కుప్పలుచేసి స్నానానికి వెళతారు. దూరంనుంచి వచ్చే మరోనలుగురు వీరుచేసినదానిని చూసి వాటి ప్రక్కనే మరోనాలుగు శివ లింగాలు చేస్తారు. ఇలా సముద్ర స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరు ముందు వారిని చూసి “ఈ పర్వదినాన ఇసుకని శివలింగంగా చేసి సముద్రస్నానం చేయాలి” అనుకొని అలాగేచేస్తారు. ఇలా వందల సంఖ్యలో ఆ సముద్రపు ఒడ్డున శివలింగాలు ఏర్పడుతాయి. మొదటి భక్తుడు స్నానం చేసి ఒడ్డుకి వచ్చి చూసి ఆశ్చర్యపోయి!, అన్ని శివలింగాలలో తన చెంబు కోసం గుర్తుగాచేసిన ఇసుక కుప్ప ఎక్కడ ఉందో తెలుసుకోలేక, తన రాగి చెంబు పోయినందుకు బాధపడుతూ “ నేనుచేసిందే చూసి చెసేరు కాని ఎందుకు చేసానో అందలి పరమార్థం ఏమిటో తెలుసుకో లేక పోయారు” అని “గతాను గతికోలోకః న లోకః పారమార్ధికః” అనుకొంటూ వెల్లి పోతాడు.” పై చాటు శ్లోకం రావడానికి ఇంతటి రసవత్తరమైన సన్నివేశం జరిగింది. ఇట్టి చమత్కార యుతమైన చాటువులు ముందు,ముందు మరిన్ని తెలుసుకొందాం.



 

సాహిత్యంలో చాటువులు – 3

“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,

హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” హాస్యానికి

ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార

భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి

ఆనందించండి.


“ఆణోరణీయాన్ మహతో మహీయాన్

మధ్యో నితంబశ్చ మదంగనాయాః

తదంగ హారిద్ర నిమజ్జనేన

యజ్ఞోపవీతం పరమం పవిత్రం”


పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.

భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారుట.


ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.


మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ

“యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది.


మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు.


అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు.


అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం - - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. చూసారా! కాళిదా స కవితావైభావం. మరొక్కసారి పైశ్లోకం చదివి ఆనందించండి.


భోజుని ఆస్థానానికి సబంధించినదే మరోచాటుశ్లోకం. “ ఒకరోజు భోజుని ఆస్థానానికి ఒకకవి వచ్చి, చక్కని కవిత్వం చెప్పి, సన్మానింపబడిన పిదప, మంచి భోజనం పెట్టమని అడుగుతాడు. రాజుగారు ఎటువంటి భోజనం కావాలి? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ కవి తనకి కావలసిన పదార్థాలని చక్కని కవితారూపంలో ఇలా అడుగుతాడు.----

“ భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం

మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి” అనగా

“ఓ రాజా! నాకు మంచి భోజనం పెట్టు. ఆ భోజనంలోకి మంచి నెయ్యి,పప్పు మొదలగు పదార్థాలతోపాటు, శరత్ కాలంలోని చంద్రుని కిరణాలవలె తెల్లగా ఉన్న గేదె పాలతో తయారైన గడ్డ పెరుగు కూడ కావాలని కోరుతాడు. పెరుగును కవితాత్మకంగా వర్ణించిన విధానానికి భోజరాజు సంతసించి, చక్కని భోజనం పెట్టి, మరల ఘనంగా సత్కరించి పంపుతాడు. మనంకూడా శరశ్చంద్ర చంద్రిక వంటి పెరుగుతో భోజనం చేసి,భోజన ప్రియులం అనిపించుకొందాం.


 

సాహిత్యంలో చాటువులు 4


కాళిదాస మహాకవి గొప్పతనం జగద్విదితం. అందుకే “కవికుల గురు: కాళిదాసః” అని

అందరిచే కీర్తించబడినాడు. ఇంకా కాళిదాసు గొప్పతనాన్ని తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని

తెలుసు కొందాం.


“పురా కవీనాం గణన ప్రసంగే /

కనిష్టికా దిష్టిత కాళిదాసః//

అద్యాపి తత్తుల్య కవేరభావాత్

అనామికా సార్థవతీ బభూవ //


“ పూర్వం కవులని గణన అనగా ఎవరు ముందు ఎవరు తరువాత అని లెక్కించడం

ప్రారంభించగా, చిటికిన వేలుని (ప్రధమ స్థానాన్ని) కాళిదాసు అధిరోహించెనట. తదుపరి

రెండవ స్ధానం కోసం (ఉంగరం వేలుకి “అనామిక” అని పేరు.) రెండవ వేలుని అధి

రోహించడానికి ఇప్పటికీ కాళిదాసుతో సమానమైన కవి లేనందున ఆ రెండవవేలుకి

అనామిక అనేపేరు సార్థకమైంది.” అనిభావం. ఇక్కడ మనం ఐదు వేళ్ళ పేరులని

తెలుసుకొందాం.


లెక్కించేటప్పుడు చిటికిన వ్రేలితో ప్రారంభించాలి అని పెద్దల చెపుతారు.

అలాగె వరుసగా వద్దాం. ఒకటి.చిటికిన వేలుని “కనిష్టిక” అంటారు. అంటే చిన్నది అని

అర్థం. రెండు. ఉంగరం వేలు. దానికి “అనామిక” అనిపేరు.అనగా పేరులేనిది అని అర్థం.

ఎవరో తెలియని వారిని అనామకులు అంటారుకదా. మూడవదైన మధ్యవేలుని,

“మధ్యమ” అంటారు. నాల్గవ వేలు చూపుడి వేలు. దీనిని “తర్జని” అంటారు. ఎవరినైనా

బెదిరించాలంటే ఈ వేలుని చూపుతారు, తర్జనం అంటే బెదిరించడం అని అర్థం. చివరది

ఐదవది అయిన బ్రొటకన వేలుని “అంగుష్టం” అంటారు. మంత్ర శాస్త్రంలో, సంధ్యావందనంలో

అంగన్యాస, కరన్యాసాలు చేసేవారు ఈ పేర్లతో పిలుస్తారు. చూసారా మన వేళ్ళకి

సంస్కృతంలో ఎంత చక్కని పెర్లున్నాయో.


ఇక కాళిదాస మహాకవి గొప్పతనాన్ని తెలిపే మరో చమత్కార శ్లోకాన్ని తెలుసు

కొని, ఆనందిద్దాం. సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు

పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది.

“కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః”/ అని శ్లోకపాదం చెప్పిందట. అనగా సంస్కృతంలో దశకుమార చరిత్రం అనే గొప్ప కావ్యాన్నివ్రాసిన దండి అనేవాడే మహాకవి అనుటలో సందేహం లేదు, అని తెలపడానికే రెండు పర్యాయాలు “కవిర్దండీ కవిర్దండీ” అనిపలికి, ఉత్తరరామ చరితం వంటి మహోన్నతమైన నాటకాలు వ్రాసిన భవభూతిని మహాపండితుడు అని వాగ్దేవి చెప్పిందట. అప్పుడు కాళిదాసుకి చాలకోపంవచ్చిందట. కారణం తనని కవి అనికాని,పండితుడని కాని గుర్తించలేదని. లోకంలో కవులు,పండితులేకదా! ఉండేది. తాను ఏ కోవకి చెందని వాడనా అని. వెంటనే “కోహం – -(తరువాతి పదం ఒక తిట్టు.అందుకని పేర్కొన లేదు.) ఓ – నేనెవరిని ? అని గట్టిగా అడిగేడట. పిల్లల కోపాన్ని తల్లి సహించి బుజ్జగిస్తుంది కదా! అందుకే వెంటనే అమ్మ ---

“త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః.”

అనగా నీవేనేను, నీవేనేను, నీవేనేను సందేహమేలేదు. అని నొక్కి వక్కాణించిందట. సాక్షాత్ సరస్వతి స్వరూపమే కాళిదాసు అనుటలో సందేహమేలేదు.అని ఆ చదువుల తల్లి స్వయంగా తెలిపింది. అందుకే “కవిలోకానికే గురువు కాళిదాసు. అట్టి కాళిదాసు పుట్టిన భూమిపై పుట్టిన మనం ధన్యులం.


1,173 views0 comments

Recent Posts

See All
bottom of page