Search
  • TPN Acharyulu

సంస్కృత న్యాయాలు-ఆధ్యాత్మిక విశేషాలు (3వ భాగం)


దండాపూపికాన్యాయం:


దండ=కొయ్య (కర్ర) అపూప =అప్పాలు. అనిఅర్థం. దీనిని ఒక చిన్ని కథ ద్వారా వివరిస్తాను.

ఒక యాచకుడు భిక్షాటనచేసి కొన్ని అప్పాలు (అపూపాలు) సంపాదించేడు. కొన్ని తిని, మిగిలినవి మూట కట్టి గోడకి ఉన్న కోయ్యకి తగల్చి నిదుర పోయాడు. ఉదయం లేచి చూస్తె ఆ అప్పాల మూట కనపడ లేదు. పరిశీలించగా ఆ చిలక్కొయ్యని ఎలుకలు పళ్ళతో కొరికి నట్లు కనపడింది. కర్రనేకొరికిన ఎలుకలు అప్పాలు మాయం చేయడంలో వింత ఏమిఉంది! అని తెల్పేదే ఈ దండాపూపికా న్యాయం. దీనిని ఉపనిషత్తులకి అన్వయించి, ఉదాహరణలతో తెలుసుకొందాం.

ఏది సత్యమో దానినే గ్రహించాలి. ఏకం సత్ విప్రాః బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే! అదే శక్తి, తేజస్సు, ఓజస్సు, శబ్దం, కాంతి, పరమాత్మ, ఆత్మ, ఈశ్వరుడు, ఆదిశక్తి, పరభ్రహ్మ, ఇలా ఎన్ని నామాలతో పిలిచినా ఆస్వామి ఒక్కడే. అని తెల్పేదే ఉపనిషత్. ఇది తెలుసుకోవాలంటే, తగిన కృషి, పట్టుదల ఓర్పు ,ఏకాగ్రత ఉండాలి. అప్పుడు మనకి సర్వం ఖల్విదం బ్రహ్మ అనే సత్యం అర్థం అవుతుంది. గమ్యం చేరాలంటే అడుగు వెయ్యాలికదా! కనుక మనసులో సంకల్పం కలగాలి. ఆరంభించరు నీచ మానవులు,ఆరంభించిన దానిని పూర్తి గావించేవారు ఉత్తములు. అన్న సుభాషితం తెలుసుకొని పట్టుదలతో అనుకొన్నది సాధించాలి.

అప్పుడే ప్రకృతి, పురుషుడు, ఆత్మా, పరమాత్మ తత్త్వాలు తెలుస్తాయి. అదే ఉపనిషత్ జ్ఞానం. దీనిని(గరుడ పురాణంలొఉన్న) ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము. ఒక తీతువు పక్షి సముద్రపు ఒడ్డున ఉన్న చెట్టుమీద కాపురం ఉంటోంది. ఆ చెట్టు మీద గూడుకట్టి అందులో గుడ్లు పెట్టి, ఆహారానికి వెళ్ళింది. ఒకరోజు సముద్రపు అల పెద్దగ వచ్చినందువల్ల, గుడ్లతో సహా ఆ గూడు కొట్టుకు పోయింది. పక్షి తిరిగి వచ్చి చుస్తే గుడ్లు కనపడక బాధ పడి, ఇది సముద్రుడి పనే అని తలచి,సముద్రజలాల్ని ఎండగట్టి తన గుడ్లు సంపాదించాలి అని తలచి, తన చిన్ని నోటితో ఒక్కొక్క చుక్క నీటిని సముద్రం నుంచి తీసుకొని ఇసకలో ఒదలటం ప్రారంభించింది. ఇలా రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా తన ప్రయత్నం మానలేదు. కొన్నాళ్ళకి, పక్షి రాజైన గరుత్మంతుడు ఆ తీతువు చేసే పనిని చూసి ఆశ్చర్య పడి. దగ్గరకు వచ్చి, కారణం తెలుసుకొని, ఆ చిన్ని పక్షి పట్టుదలతో సముద్రాన్ని ఎండ గట్టి తన పిల్లల్ని పొందాలన్న సంకల్పాన్ని మెచ్చుకొని, తన రెక్కలతో సముద్ర జలాల్ని పక్కకి తొలగించి, పక్షి గుడ్లని ఆ తీతువుకి ఇచ్చి కటాక్షిస్తాడు. పట్టుదలకి ఇది ఒక చిన్నకథ. అంటే ఆత్మ, పరమాత్మ తత్త్వాలని తెలుసుకొని బ్రహ్మానందం పొందడానికి ఒక చిన్నిప్రయత ్నంచేసినా, భగవంతుడు తప్పక కరుణిస్తాడు. అనగా ఒకచిన్న విషయం ద్వారా పెద్ద విషయం తెలుసుకో వచ్చు అని తెల్పేదే ఈ దండాపూపికాన్యాయం.

ఇంకా ఈ దండాపూపికా న్యాయానికి వర్తించే మరికొన్ని విశేషాలు తెలుసుకొందాము. పూర్వ జన్మలు, మానవ సంస్కారాలు, కర్మఫలాలు, భగవద్దర్శనం ఇలా ఎన్నో విషయాలు ఉపనిషత్తులు మనకి విపులంగా, సులభంగా తెలియ జేశాయి. మనకున్న కాలాన్ని కొంచం ఉపయోగిస్తే ఈ యాంత్రిక జీవనం నుండి,మానసిక ఆందోళనల నుండి బైట పడి, సుఖ శాంతులతో, జీవితాన్ని, ఆనందంగా గడపడానికి మార్గం దొరుకుతుంది. అంటే కొద్ది ప్రయత్నంతో, గొప్ప లాభాన్ని పొందవచ్చు. ఇదే మన ఋషులు మనకిఇచ్చిన అమూల్య సంపద. "భగవంతుణ్ణి దర్శించాము' అని మనకి ప్రాచీన కాలం నుండి, ఆధునిక కాలంలో ఉన్న అనేక మంది దివ్య పురుషులు అనగా వశిష్ట, విశ్వామిత్ర, వాల్మీకి, వ్యాసాదిఋషులు; ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, రామకృష్ణపరమహంస, స్వామి వివేకానందాది ఎందరో మహా పురుషులు తెల్పేరు. వారు క్రాంత దర్శిత్వం అంటే సమస్తాన్ని దర్శించగల శక్తి గలవారు. వారు చెప్పింది మనం విశ్వసించాలి. అప్పుడు మనం కూడ భగవంతుణ్ణి చూడగలం. ఇది సత్యం.

ఉదా;- అమెరికాదేశాన్ని చూసినవారు, చూడని వారి దగ్గర దాని గొప్పతనాన్ని, అక్కడ ఉన్నఅద్భుత కట్టడాల్ని, వింతలని చెపితే మనం ఆదేశం చూడలేదు కనుక అసత్యం అని అనలేముకదా! మన కంటికి కనిపించక పోయినా అది అక్కడ ఉంది. చూసిన వారికి అది సత్యం చూడని వారికి అది అసత్యం. దీనినే ఉపనిషత్తు సర్ప రజ్జు భ్రాంతి అంటుంది. (చీకటిలో, తాడుని చూసి పాము అనుకొని భ్రమ పడటం.) దీనినే బ్రహ్మ సత్యం జగన్మిధ్య అన్నది తెలియక, అనిత్యమైన జగత్తు నిత్య మని, నిత్యమై బ్రహ్మ అనిత్యమని భ్రమించడమే పై భ్రాంతి. ఇదే ఉపనిషత్తు బోధిస్తుంది.

ఈ సత్యాసత్యాలని, విద్య, అవిద్యలని బోధించి ఆత్మజ్ఞానాన్ని కలిగించే 1. ఈశావాస్య మిదం సర్వం. 2. బ్రహ్మసత్యం జగన్మిధ్య. 3ఏకోహం బహుస్యాం. 4 బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి 5 ధర్మో రక్షతి రక్షితః 6 సహనావవతు, 7 భద్రం కర్ణేభిః 8 సర్వేజనాః సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దు:ఖ మాప్నుయాత్.

ఇలా ఎన్నో మరెన్నో భారతీయులకే కాదు, విశ్వ మానవాళికి మార్గ దర్శకత్వం చూపి, లోకకల్యాణంకోరే, విశేషాలు మన వేదాలలో,ఆరణ్యకాలలో, ఉపనిషత్తులలో, బ్రాహ్మణాలలో, న్యాయ, మీమాంస, దర్శనాలలో, పురాణాలలో, రామాయణాది కావ్యాలలో,భగవద్గీతాది మహా గ్రంధాలలో నిక్షిప్తం చేసి, మహా నిధిని ఋషులు మనకందించారు. ఈ ఉదాహరణ చూడండి; -పర్యావరణాన్నిఎంత గొప్పగా ఋషులు ప్రేమించారో ఈ మంత్రం తెల్పుతుంది. ఓం మధు వాతా రుతాయతే మధుక్షరంతి సింధవ: అన్న మంత్రంలో మనకి ఉపకారం చేసే గాలి, నీరు, నదులు తియ్యగా ఉండుగాక, చెట్టుచేమలు పుష్టిగా ఉండుగాక. ఆవులు, భూమి, ఆకాశం, సూర్య,చంద్రులు, మాధ్వీ భవంతు అనగా తీయదనంగా (మంచిగా) ఉండుగాక. అన్నఅద్భుత భావన నాన్యతో దర్శనీయం. ఆధునిక విజ్ఞానం (సైన్సు)కంటికి కనిపించే దానిని, అణువులని, పరమాణువులని, కూడా యంత్రాల సహాయం తోనే విశ్లేషించి, నిర్వచించ గలదు. కాని మన అధ్యాత్మ జీవన విధానం, వేదవిజ్ఞానం, కంటికి కనిపించని సృష్టి రహస్యాలని కుడా వేల, వేల సంవత్సరాలకు ముందే ఆవిష్కరించింది. జీవి పయనించే విధానం చూడండి;- స్థూల, సూక్ష్మ దేహాలలో ముందుగా స్ధూల దేహం నుండి అన్నమయ కోశం తొలగి పోతుంది. తదుపరి ప్రాణమయ కోశం పోతుంది. అప్పుడు జీవి సూక్ష్మ శరీరంతో మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల ద్వారా ఒక కాంతి వలయంలోకి ప్రవేశించి, అక్కడ తాను చేసిన కర్మలని దర్శించి, తత్ ఫలితాలను అనుసరించి మరలజన్మపొందుతుంది. దీనిని తేలికగా చెప్పాలంటే మరణం ఆసన్న మైనపుడు, ఆహారం తీసుకోడం ఆగిపోతుంది. ఆపై ప్రాణంపోతుంది. ప్రాణం లేదు అని మాత్రం నేటి సైన్సు చెప్తుంది. తదుపరి జరిగే ప్రక్రియల్ని, జీవి పయనించే విధానాన్ని, మరు జన్మల్ని ఉపనిషత్ విపులంగా వివరిస్తుంది. పునర్జన్మల్ని ఆధునికులు కూడా అంగీకరించారు కదా!!

ఉదా;-- అమెరికా శాస్త్ర వేత్త ఇయాన్ స్టీవెన్సన్ వర్జీనియా యునివర్సిటీలో 1974లో పునర్జన్మలపై పరిశోధన చేసి సమర్పించిన, సిద్దాంత వ్యాసంలో. అమెరికాలో 324, బర్మాలో139, ఇండియాలో 135, టర్కీలో 114, ఇంగ్లాండ్ లో 111.మంది వ్యక్తులకు పునర్జన్మ జ్ఞాపకాలు ఉన్నట్లు తెల్పారు. (ఈ వివరాలు వేద విజ్ఞానం అనే గ్రంథం నుండి సేకరించబడినవి. రచయితకి కృతజ్ఞతలు.) ఇట్లాంటి ఒకటి, రెండు విషయాలను తెలుసుకొని వీటి ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాల, వేదాల, వేదాన్తాల గొప్పదనాన్ని, అద్భుత విషయాలని గ్రహించడమే దండాపూపికాన్యాయ అని చెప్పవచ్చు. (ఈ వ్యాసాల ద్వారా ఉపనిషత్తుల గొప్పదనాన్ని కొద్దిగా తెల్పి, వాటిపై కొద్దిమందికైనా, ఉత్సుకత కలిగించి, భావితరాలకి అంటే, మనపిల్లలకి కుడా తెలపాలి అనేదే రచయిత ముఖ్యోద్దేశం. గమనించ ప్రార్ధన.)


తుషావఘాత న్యాయం:


ఈ న్యాయానికి “పొల్లు లేక, ఊక దంచుట” అని అర్థం. అనగా ధాన్యం దంచితే బియ్యం లభిస్తాయి కాని,ధాన్యపు పొల్లు ఎంత దంచినా బియ్యం లభించవు కదా? ఎంత కష్ట పడ్డా ఫలితం దక్కక పోతే ఆప్రయత్నం వ్యర్థం అని తెల్పేదే “ఈ తుషావఘాతన్యాయం.”

ఉపనిషత్తులు అన్ని ఆనందాలకన్న, బ్రహ్మానందమే శాశ్వతమైనది అని వివరిస్తాయి. దీనిని ఆధునిక మైన ఓ కథ ద్వారా తెలుసు కొందాము. భగవద్రామానుజుల వారికాలంలో ధనుర్దాసు అనే ఓ మల్ల యోధునికి హేమాంబ అనే అందమైన భార్య కలదు. ఆమె అంటే ధనుర్దాసుకు అధికమైన ప్రేమ. ప్రతి రోజు రామానుజులవారు కావేరి నదిలో స్నానం చేసి, శిష్యులతో శ్రీరంగనాధుని సేవించుకోడానికి వెళ్తూఉంటారు.ఆదారిలోనే ధనుర్దాసు హేమాంబకి ఎండ తగలకుండా గోడుగుపడుతూ ప్రతి రోజు వస్తూవుంటాడు. అది రామానుజుల వారు చూసి ఆశ్చర్య పడతారు. ఒకరోజు రామానుజుల వారు దనుర్దాసుని పిలిచి “నీవు చేసే పని చాల వింతగా ఉంది. భార్యకి భర్త గొడుగుపట్టడం, నీవు ఎండలో నడవడం చూసి లోకులు పరిహసించరా! ఎందుకు అలా చేస్తున్నావు.” అని అడుగుతారు.

దానికి ధనుర్దాసు ఇలా చెప్తాడు. “స్వామి నా భార్య నేత్ర సౌందర్యం అపూర్వమైనది. అది ఎండకి వాడి పోకుండా కాపాడు కొంటున్నాను, ఎందుకంటే ఆనేత్రాలు నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తాయి. వాటికి నేను దాసుడను. లోకులు ఏమను కొన్నా పరవాలేదు, నా ఆనందం నాది.” అని జవాబు చెప్తాడు. అపుడు రామానుజుల వారు “ఓ హో నీవు సౌందర్యాన్ని ఆరాధించే భక్తుడవన్నమాట, సరే నీ భార్య నేత్ర సౌందర్యం కొన్నాళ్ళకి వాడిపోతుంది. దాని కన్నా మించిన సౌందర్యాన్ని చూపిస్తాను, అది శాశ్వతమైనది, లోకంలోని అన్ని సౌందర్యాలని సృష్టించినది, అట్టి సౌందర్యాన్ని చూపిస్తాను రా! అని చెప్పి, శ్రీరంగ నాధస్వామి గుడికి తీసుకొని వెళ్లి “ఫణి పతి శయనుడు, నిద్రాముద్రాభి రాముడు, ఆకర్ణాంతవిశాలనేత్రుడు ఐన స్వామిని(ఆ గుడిలో విగ్రహాన్ని) దర్శింప చేస్తారు ఆస్వామి ముఖ మండలాన్ని చూసిన ధనుర్దాసు ఇది అది అని చెప్పలేని ఆనందాన్ని అనుభవించి, భక్తిపరవశుడై, నాటినుంచి తన భార్యతో సహా రామానుజుల వారికి శిష్యుడై, అధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ”కనుక చిన్ని, చిన్ని ఆనందాలను పొందడానికి శ్రమించే దానికన్నా, శాశ్వత బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నిస్తే, శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది అని తెల్పేదే “ఈ తుషావఘాత న్యాయం.” ఇంకా మంచి దృశ్యం చూస్తే కలిగే ఆనందం, మధురమైన వార్త వింటే, ఇష్తమైన పదార్ధం తింటే, కొత్త బట్టలు ధరిస్తే, ఆకస్మికంగా ధనం లభించినా, కావలసిన వారిని చూసినా ఇలా అనేక కారణాలవల్ల మనకి ఆనందం కలుగుతుంది.

ఇటువంటి వంద కారణాల వల్ల లభించే ఆనం దాలు కలిస్తే ఒక మనుష్య ఆనందం అవుతుంది. ఇట్టి వంద మనుష్య ఆనందాలు ఒక గాంధర్వ ఆనంద మని, అట్టివి వంద కలిస్తే ఒక దేవ ఆనంద మని ఇలా అనేక ఆనందాలను “ఆనందవల్లిఉపనిషత్తు”లెక్కలప్రకారం తెల్పి, ఇటువంటి వేల వేల ఆనందాలు కలిస్తే ఒక “బ్రహ్మానందం”అవుతుంది, అని విపులంగా వివరిస్తుంది.

చిన్ని, చిన్ని ఆనందలకోసం మనం శ్రమించే బదులు, శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నింఛి, కామి మోక్షగామిగా మారడం మంచిది. అనివివరిస్తుంది ఈ “తుషావఘాత న్యాయం.”


16 views0 comments

Recent Posts

See All